Let's talk: editor@tmv.in
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి భారీ పెట్టుబడులు

Dantu Vijaya Lakshmi Prasanna
26 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తోందని, గత 18 నెలల కాలంలో ఈ రంగంలో రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం వల్ల పెట్టుబడిదారుల ఆసక్తి గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రానికి మైలురాయిగా నిలిచిందని పేర్కొంటూ, దాని ఫలితంగా మొత్తం రూ.20,088 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి బలమిస్తున్నాయని వివరించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, వచ్చిన పెట్టుబడుల్లో రూ.9,445 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 7,348 హోటల్ గదులు అభివృద్ధి దశలో ఉన్నాయి. కొత్త హోటళ్లు, రిసార్టులు, టూరిజం ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన తెలిపారు.

టూరిజం పాలసీ 2024-29లో అనేక వినూత్న మార్పులు చేపట్టామని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేలా విధానాలను సవరించినట్లు దుర్గేష్ తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో సుమారు 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాసనమండలికి పోర్టుల అభివృద్ధిపై వివరాలు అందించారు. 2026 జనవరి 31 నాటికి రామాయపట్నం పోర్టుపై రూ.2,640 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే మచిలీపట్నం పోర్టుపై రూ.2,264 కోట్లు, మూలపేట పోర్టుపై రూ.2,833 కోట్లు, కాకినాడ ఎస్‌ఈజెడ్ పోర్టుపై రూ.620 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొన్నారు.

మత్స్యకార నౌకాశ్రయాల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జనార్దన్ రెడ్డి తెలిపారు. ఉప్పాడ హార్బర్‌పై రూ.282 కోట్లు, మచిలీపట్నం హార్బర్‌పై రూ.263 కోట్లు, నిజాంపట్నం హార్బర్‌పై రూ.229 కోట్లు, జువ్వలదిన్నె హార్బర్‌పై రూ.201 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, మత్స్యకార నౌకాశ్రయాలన్నీ నిర్ణీత కాలంలో పూర్తి చేసి రాష్ట్ర ఆర్థి కాభివృద్ధికి దోహదం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.