Let's talk: editor@tmv.in
ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎస్‌ఐఆర్‌’ గడువు 10 రోజులు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎస్‌ఐఆర్‌’ గడువు 10 రోజులు పొడిగింపు

Gaddamidi Naveen
15 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు ఎన్నికల సంఘం 10 రోజుల గడువు పొడిగించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్‌ యాదవ్‌ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం వెల్లడించింది.

ఈ మేరకు బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జూలై 24 వరకు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ఈ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై, మునుపటి షెడ్యూల్ ప్రకారం జూలై 14తో ముగియాల్సి ఉంది. అయితే సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కోరడంతో షెడ్యూల్‌ను సవరించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

సవరించిన షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జూలై 24 నాటికి పూర్తవుతుంది. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను జూలై 31న ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులను జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు స్వీకరిస్తారు. అదే సమయంలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్‌ 28 వరకు కొనసాగుతుంది. అన్ని దశలు పూర్తైన అనంతరం తుది ఓటరు జాబితాను అక్టోబర్‌ 10న విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.