Let's talk: editor@tmv.in
ఆంధ్రప్రదశ్‌ను మత్తు పదార్థాల కేంద్రంగా మార్చేశారు: వైఎస్సార్‌సీపీ

ఆంధ్రప్రదశ్‌ను మత్తు పదార్థాల కేంద్రంగా మార్చేశారు: వైఎస్సార్‌సీపీ

Panthagani Anusha
17 మార్చి, 2026

తెలంగాణలో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టకు తీరని అవమానమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎస్‌వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు. ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుగాంచిన మన రాష్ట్రం ప్రస్తుతం డ్రగ్స్ గంజాయికి కేంద్రంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఒక ఫార్మ్‌హౌస్‌లో జరిగిన దాడిలో అధికార పార్టీ ఎంపీ దొరకడం గమనార్హమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటన సమయంలో పోలీసులపై కాల్పులు జరిగాయన్న వార్తలు రావడం చూస్తుంటే దీని వెనుక పెద్ద డ్రగ్స్ మాఫియా నెట్‌వర్క్ ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షలతో 'రెడ్ బుక్' అమలు చేయడంపై చూపిస్తున్న శ్రద్ధను మత్తు పదార్థాలను అరికట్టడంపై చూపడం లేదని విమర్శించారు. నైతిక బాధ్యత వహిస్తూ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో డ్రగ్స్ రహిత రాష్ట్రం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఒక పార్లమెంట్ సభ్యుడు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం ఆయనను ఎన్నుకున్న ప్రజలను వంచించడమేనని ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ వెంటనే స్పందించి తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన కోరారు.

తెలంగాణ పోలీసుల ప్రత్యేక బృందం నిర్వహించిన ఈ దాడిలో ఎంపీతో పాటు మరో పది మందిని అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి నిజాలను బయటపెట్టాలని నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.