Let's talk: editor@tmv.in
ఆంధ్ర–తెలంగాణ ఉగ్ర కుట్ర కేసు: ఇద్దరిపై ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు

ఆంధ్ర–తెలంగాణ ఉగ్ర కుట్ర కేసు: ఇద్దరిపై ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు

Gaddamidi Naveen
12 నవంబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రంగా చేసుకున్న ఉగ్ర కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇద్దరు నిందితులపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.సోషల్ మీడియా వేదికల ద్వారా దేశవ్యాప్తంగా యువతను ర్యాడికలైజ్‌ చేయడానికి ప్రయత్నించిన ఈ కేసు ఆంధ్ర–తెలంగాణలో సంచలనంగా మారింది.

ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో నిందితులుగా విశాఖపట్నం జిల్లా విజయనగరం చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ పేర్లు ఉన్నాయి. వీరిని ఈ ఏడాది మే 16, 17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేయగా,అనంతరం కేసును ఎన్ఐఏ స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు.ఇప్పుడు విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

దర్యాప్తులో, నిందితులు ఐసిస్‌ ప్రేరేపిత ఉగ్ర సిద్ధాంతాలను ప్రచారం చేయడం, యువతను మతం పేరుతో ఉగ్రకార్యకలాపాలకు ప్రేరేపించడం, దేశ వ్యాప్తంగా దాడులు చేయాలనే కుట్రలు పన్నడం వంటి చర్యల్లో పాల్గొన్నట్లు వెల్లడైంది.ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌, సిగ్నల్‌ వంటి సోషల్ మీడియా వేదికల్లో అనేక గుప్త గ్రూపులు సృష్టించి,వాటి ద్వారా ఉగ్రవాదకి ప్రపగాండా,మత ఆధారిత ద్వేష ప్రసారం,కొత్త అనుచరులను ఆహ్వానించడం, హింసను రెచ్చగొట్టే పోస్టులు చేయడం వంటి చర్యలు చేపట్టినట్లు ఎన్ఐఏ పేర్కొంది.

ఈ చర్యలు దేశ ఏకత్వం,సమగ్రత, సామాజిక సౌహార్ద్యానికి తీవ్ర ముప్పుగా మారాయని సంస్థ స్పష్టం చేసింది.నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్),చ‌ట్ట‌విరుద్ధ‌ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ),అలాగే స్ఫోటక పదార్థాల చట్టం కింద కేసులు నమోదు చేశారు.ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నట్లుగా,ఈ ఉగ్ర కుట్ర వెనుక ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ వివరాలు తెలుసుకోవడానికి, ఆన్‌లైన్‌ ర్యాడికలైజేషన్‌లో పాల్గొన్న ఇతరులను గుర్తించడానికి తదుపరి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.

ఆంధ్ర–తెలంగాణ ఉగ్ర కుట్ర కేసు: ఇద్దరిపై ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు - Tholi Paluku