Let's talk: editor@tmv.in
ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ

ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ

Panthagani Anusha
8 ఏప్రిల్, 2026

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' కార్యాలయం వద్ద మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సంస్థ ప్రచురిస్తున్న కథనాలు తమ పార్టీని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నాయని జర్నలిజం ముసుగులో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతూ వైసీపీ శ్రేణులు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు.

రాధాకృష్ణ వ్యాసాలపై ఆగ్రహం – క్షమాపణకు డిమాండ్

ఈ నిరసనలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు 'ఆంధ్రజ్యోతి' మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ రాసిన వ్యాసాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రచనలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని ఒక నిర్దిష్ట అజెండాతోనే పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు. ముఖ్యంగా కొన్ని కథనాల్లో మహిళలను కించపరిచేలా ఉన్న అంశాలపై నేతలు నిప్పులు చెరిగారు. "ఇది జర్నలిజం కాదు—లక్ష్యంగా చేసుకుని దూషణలు చేసే ప్రయత్నం అని నినదించారు. మహిళా లోకానికి, పార్టీ శ్రేణులకు వేమూరి రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

మీడియా నైతికతపై ప్రశ్నలు

ఇక పత్రికా స్వేచ్ఛకు బాధ్యత కూడా అనుసంధానమై ఉండాలని ధృవీకరణ లేని అంశాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించడం వల్ల మీడియాపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుందని వారు హెచ్చరించారు.

పత్రికా స్వేచ్ఛపై దాడి: సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఇదిలా ఉండగా వైసీపీ నిరసనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. మీడియా సంస్థలను బెదిరించడం ద్వారా పత్రికా స్వేచ్ఛను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే హానికరమని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా రోడ్లపైకి వచ్చి మీడియాను భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి విషపూరిత రాజకీయ సంస్కృతి ని ప్రోత్సహిస్తోందని మీడియాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని సీఎం స్పష్టం చేశారు.

కాగా ఒకవైపు మీడియా నైతిక విలువలు, సామాజిక బాధ్యతను ప్రశ్నిస్తున్న వైసీపీ. మరోవైపు పత్రికా స్వేచ్ఛను కాపాడటమే తమ ప్రాధాన్యమని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఈ రెండు వర్గాల మధ్య తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.