
ఆంగన్‌వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి గుమ్మడి సంధ్యారాణి
రాష్ట్రంలోని ఆంగన్‌వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంగన్‌వాడీల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని వివరించారు. గత ప్రభుత్వం మాదిరిగా కార్మికులను రోడ్లపైకి రానివ్వకుండా వారిని గౌరవిస్తూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
90 శాతం డిమాండ్లు పూర్తి
ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆంగన్‌వాడీ సంఘాలు తమ ముందుంచిన పది ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే తొమ్మిదింటిని పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నాసిరకం మొబైల్ ఫోన్ల స్థానంలో ప్రస్తుతం అత్యాధునిక 5జీ మొబైల్ ఫోన్లను అందజేశామని తెలిపారు. దీనివల్ల డిజిటల్ రిపోర్టింగ్ సులభతరమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అదేవిదంగా ఆంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
వేసవి సెలవుల మంజూరు - వేతనాలపై కసరత్తు
ఆంగన్‌వాడీల చిరకాల కోరిక అయిన 15 రోజుల వేసవి సెలవులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి గుర్తుచేశారు. ఇక వేతనాల పెంపు అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, వేతనాన్ని వెంటనే రూ.11,000 నుంచి రూ. 26,000కు పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే వేతనాల పెంపుపై ఉన్న అన్ని సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విధులకు ఆటంకం కలిగించవద్దు
ధర్నాలు, నిరాహార దీక్షల వల్ల ప్రయోజనం ఉండదని సమస్యలు చర్చల ద్వారానే కొలిక్కి వస్తాయని మంత్రి సంధ్యారాణి సూచించారు. "కొందరు వ్యక్తుల ప్రేరణకు లోనై ఆంగన్‌వాడీ కార్మికులు నిరసనల్లో పాల్గొనవద్దు. ప్రభుత్వం మీ సంక్షేమానికి కట్టుబడి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కార్మికులు ప్రభుత్వానికి సహకరించాలి అని ఆమె విజ్ఞప్తి చేశారు. విధులకు హాజరై చిన్నారులు, గర్భిణీలకు అందాల్సిన సేవలకు ఆటంకం కలిగించవద్దని కోరారు.
ఇదిలా ఉండగా\ చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఆంగన్‌వాడీ కార్మికులు ఫిబ్రవరి 24 నుంచి 42 రోజుల సమ్మె చేపట్టారు. తమ వేతనాలను పెంచాలని ఇతర సంక్షేమ డిమాండ్లను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
