
అహ్మదాబాద్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు: గణతంత్ర వేడుకలు జరపవద్దని హెచ్చరిక
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని పలు విద్యాసంస్థలను బాంబు బెదిరింపులు వణికించాయి. శుక్రవారం ఉదయం నగరంలోని దాదాపు 12 ప్రముఖ పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు అందాయి. ఈ సమాచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పాఠశాల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి. అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలతో కలిసి ఆయా పాఠశాలల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, గంటల తరబడి జరిపిన సోదాల్లో ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో, ఆ బెదిరింపులన్నీ కేవలం నకిలీవని (హోక్స్) అధికారులు నిర్ధారించారు.
ఈ బెదిరింపు ఈమెయిల్‌లు కేవలం బాంబులకే పరిమితం కాకుండా రాజకీయ, వేర్పాటువాద అంశాలను కూడా కలిగి ఉన్నాయి. డీపీఎస్, ఆర్మీ స్కూల్, మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ స్కూల్ వంటి విద్యాసంస్థలకు అందిన ఈ మెయిల్స్‌లో.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవద్దని నిందితులు హెచ్చరించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను "ఖలిస్థాన్ శత్రువులు"గా పేర్కొంటూ, మధ్యాహ్నం 1:11 గంటలకు బాంబు పేలుళ్లు సంభవిస్తాయని ఆ ఈమెయిల్‌లో రాసి ఉన్నట్లు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ డీసీపీ రాహుల్ త్రిపాఠి వెల్లడించారు.
దాదాపు డజను పాఠశాలలకు ఈ మెయిల్స్ అందాయి. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా సోదాలు నిర్వహించాము, కానీ ఏమీ దొరకలేదు. ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులే" అని డీసీపీ రాహుల్ త్రిపాఠి తెలిపారు. కాగా, నగర సైబర్ క్రైమ్ విభాగం ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించనుంది.
తల్లిదండ్రుల ఆవేదన
ఈ బాంబు బెదిరింపుల వార్త దావాగ్నిలా వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై పాఠశాలల వద్దకు పరుగులు తీశారు. యాజమాన్యాలు భద్రతా కారణ దృష్ట్యా పాఠశాలలకు సెలవు ప్రకటించి, పిల్లలను ఇళ్లకు పంపించడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పదేపదే ఇలాంటి నకిలీ బెదిరింపులు రావడం వల్ల పిల్లల చదువుపై ప్రభావం పడుతోందని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ ఇమెయిల్‌లు ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఇది ఇలా ఉంటే అస్సాం రాష్ట్రంలోని గువహటిలోని పాఠశాలలకు ఇదేవిధంగా బాంబు బెదిరింపులతో ఈమెయిల్‌లు వచ్చాయి.
సరస్వతీ పూజ వేడుకల్లో గువహటి పాఠశాలలకు బాంబు బెదిరింపులు
సరస్వతీ పూజ వేడుకల సమయంలో గువహటిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సంస్కృతి - ది గురుకుల్ స్కూల్ సహా పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు అందడం విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. సమాచారం అందిన వెంటనే నగర పోలీసులు, భద్రతా దళాలు పాఠశాల ప్రాంగణాలకు చేరుకుని, అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.
తనిఖీల అనంతరం పాఠశాల ఆవరణలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు ధృవీకరించారు. ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా పాఠశాల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ బెదిరింపు మెయిల్స్ ఎవరు పంపారు, ఎందుకు పంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించిన తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
