Let's talk: editor@tmv.in
అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రియాంక గాంధీ

అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రియాంక గాంధీ

Pinjari Chand
5 జనవరి, 2026

త్వరలో ఆయా రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. చివరి బీహార్ ఎన్నికలు సీట్ల కేటాయింపు, ఇన్​ చార్జ్ ల నియామకంలో తాత్సారం వల్ల కలిగిన నష్టం ప్రస్తుత ఎన్నికల్లో కలగకూడదనే ఉద్దేశంతో ముందుగానే కమిటీలను ప్రకటిస్తోంది. అందులో భాగంగా 2026లో జరగనున్న అస్సాం శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రియాంక గాంధీని నియమిస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించింది. ప్రియాంక గాంధీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో సప్తగిరి శంకర్ ఉలాకా, ఇమ్రాన్ మసూద్, డా. సిరివెళ్ల ప్రసాద్ సభ్యులుగా ఉంటారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకూ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలను ప్రకటించింది. కేరళ స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా మధుసూదన్ మిస్త్రీ, తమిళనాడు–పుదుచ్చేరి స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా టి.ఎస్. సింగ్ దేవో, పశ్చిమ బెంగాల్ స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా బీకే హరిఫ్రసాద్ నియమితులయ్యారు. పోలింగ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా కాంగ్రెస్ ఈ నియామకాలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం

ఇదిలా ఉండగా కాంగ్రెస్ అస్సాం అధ్యక్షుడు గౌరవ్ గొగోయి రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిన్సుకియాలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం దూరదృష్టితో కూడిన అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మార్చడం తప్ప, వారిని ఆర్థికంగా స్వావలంబులుగా చేయడంలో ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్నారు. ఆలయ సేవకులకు నెలకు రూ.1,500 అందిస్తామని ప్రకటించినప్పటికీ, సత్రాలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దే చర్యలు లేవని ఆయన విమర్శించారు.

బీజేపీ ఎంతటి బలప్రదర్శన చేసినా అస్సాం ప్రజలను మోసం చేయలేరని గౌరవ్ గొగోయి స్పష్టం చేశారు. ఈసారి అస్సాం ప్రజలు ఏకమైతే, అహంకారంతో, అవినీతితో నిండిన ప్రభుత్వం సులభంగా కూలిపోతుందన్న విషయం దేశానికి తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

అరుణోదయ్ వంటి పథకాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నాయని, వాటిలో కొత్తదనం ఏమీ లేదని ఆయన అన్నారు. అస్సాం కి అవసరమైంది ప్రజలను ఆర్థికంగా స్వతంత్రులను చేసే విధానాలేనని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చామని, అప్పట్లో సత్రాలకు అందించిన మద్దతు కారణంగా అవి ఇప్పటికీ కొంతవరకు స్వతంత్రంగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల నిజమైన సాధికారత కోసం కొత్త పథకాలను అధ్యయనం చేసి అమలు చేస్తామని, ప్రజల వాస్తవ సమస్యలకు పరిష్కారాలు చూపినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని గౌరవ్ గొగోయి తెలిపారు.

అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రియాంక గాంధీ - Tholi Paluku