Let's talk: editor@tmv.in
అస్సాం సీఎం‌ను దూషించొద్దు.. కాంగ్రెస్ నేతలకు కోర్టు ఆదేశం

అస్సాం సీఎం‌ను దూషించొద్దు.. కాంగ్రెస్ నేతలకు కోర్టు ఆదేశం

Pinjari Chand
13 ఫిబ్రవరి, 2026

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై దూషిస్తూ వ్యాఖ్యలు చేయవద్దని కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, భూపేష్ బఘేల్, జితేంద్ర సింగ్‌లను గువాహటి కోర్టు ఆదేశించింది. సీఎం దాఖలు చేసిన రూ.500 కోట్ల పరువు నష్టం దావా నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్ నం.1) నయన్‌జ్యోతి శర్మ బుధవారం ‘అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్’ జారీ చేస్తూ, ప్రత్యర్థులు కోర్టులో హాజరయ్యే వరకు సీఎం గురించి మరింతగా దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం, ప్రచారం చేయడం, ప్రచురించడం లేదా ప్రసారం చేయడం నిలిపివేయాలని ఆదేశించారు. ప్రతివాదులు మార్చి 9న హాజరు కావాలని నిర్ణయించారు.

విచారణ అనంతరం అడ్వకేట్ జనరల్ దేవజిత్ సైకియా మాట్లాడుతూ, 2001 నుంచి శర్మ పోటీ చేసిన ప్రతి ఎన్నికలో తన కుటుంబ ఆస్తుల వివరాలను అఫిడవిట్లలో వెల్లడించారని కోర్టుకు తెలిపాం. రాష్ట్ర ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రతి ఏడాది మంత్రులు, ఉన్నతాధికారులు తమ ఆస్తులను ప్రకటించాల్సి ఉంటుందని, సీఎం శర్మ కూడా క్రమం తప్పకుండా వెల్లడిస్తున్నారని తెలిపారు. శర్మ గత 30 ఏళ్లుగా ఆదాయపన్ను చెల్లిస్తున్నారని, ఆయన సంపద, ఆస్తులన్నీ ఆదాయపన్ను రిటర్నులు, అస్సాం ప్రభుత్వ రికార్డులు, ఎన్నికల అఫిడవిట్లలో నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరోపణల ప్రకారం సీఎం, ఆయన కుటుంబం 12,000 బీఘాల భూమిని నియంత్రిస్తున్నారన్న సమాచారం కల్పితమేనని, దీనిపై కోర్టుకు వివరించామని సైకియా తెలిపారు. 2021లో శర్మను పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఇతర ఆరోపణలూ అసత్యమని అన్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ లాభం కోసం కాంగ్రెస్ సీఎం ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ‘హెబీఎస్ ట్యాక్స్’ అనే వ్యవస్థ రాష్ట్రంలో లేదని, కాంగ్రెస్ ఆరోపణలు సీఎం ప్రతిష్టకు భంగం కలిగించాయని పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ కోర్టులో ఆధారాలతో నిరూపించాలని, లేదంటే రూ.500 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని సీఎం తన పిటిషన్‌లో కోరినట్లు తెలిపారు. కోర్టు సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం అడ్-ఇంటరిమ్ స్టే ఉత్తర్వులు జారీ చేసినట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు.

మొత్తం ఆస్తుల విలువ రూ.17.27 కోట్లు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 2021 ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన వ్యక్తిగత ఆస్తులు సుమారు రూ.1.72 కోట్లు ఉన్నట్లు, ఆయన భార్య ఆస్తులు దాదాపు రూ.14.47 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. మొత్తం కుటుంబ ఆస్తుల విలువ సుమారు రూ.17.27 కోట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలపై దాఖలైన రూ.500 కోట్ల పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా సీఎం తరఫు న్యాయవాది కోర్టుకు వివరాలు సమర్పించారు. తాజా పిటిషన్‌లో ప్రత్యేకంగా కొత్త ఆస్తుల వివరాలు ప్రస్తావించలేదని, ఎన్నికల అఫిడవిట్లలో ఇప్పటికే ప్రకటించిన వివరాలే ప్రజా పరిధిలో ఉన్నాయని తెలిపారు.