Let's talk: editor@tmv.in
అస్సాం రాజకీయ భవిష్యత్ రక్షణే ప్రధాన లక్ష్యం: ఏజేపీ చీఫ్ గోగోయ్

అస్సాం రాజకీయ భవిష్యత్ రక్షణే ప్రధాన లక్ష్యం: ఏజేపీ చీఫ్ గోగోయ్

Pinjari Chand
27 మార్చి, 2026

అస్సాం రాజకీయ, ఆర్థిక భవిష్యత్తును కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని లురిన్‌ జ్యోతి గోగోయ్‌ తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం అస్సాం జాతీయ పరిషత్‌ (ఏజేపీ) గురువారం విడుదల చేసిన మేనిఫెస్టో, విజన్ డాక్యుమెంట్‌లో ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఏఎన్ఐతో మాట్లాడిన గోగోయ్ అస్సాం రాజకీయ భవిష్యత్తును రక్షించడం మా ప్రధాన అజెండా. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సాధారణ ప్రజలే భారాన్ని మోస్తున్నారని అన్నారు. ‘స్వయం సమృద్ధి అస్సాం’ లక్ష్యం సాధ్యం కాలేదని, ప్రస్తుతం రాష్ట్రం లోటు బడ్జెట్‌తో నడుస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడుతున్నదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక ఉత్పత్తిని పెంపొందించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు గోగోయ్ వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఉత్పత్తి రంగాలను బలోపేతం చేయడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

ఇదిలా ఉండగా, రానున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం ఏజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు గోగోయ్ ఖోవాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. డిబ్రుగఢ్ నుంచి మైనాక్ పత్రా, పలాస్బారి నుంచి పంకజ్ లోచన్ గోస్వామి, బజాలి నుంచి దిలీప్ బరువా పోటీ చేయనున్నారు. సరూపథర్ నుంచి జీవన్ చుటియా, బిన్నాకండి నుంచి రేజౌల్ కరీం చౌధరి, మోరిగావ్ నుంచి బని దాస్, బరంపూర్ నుంచి రాజెన్ గోహైన్ అభ్యర్థులుగా ఉన్నారు.

అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాల కోసం ప్రధానంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉండనుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ఒకే దశలో జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఇక 2026 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు ప్రతిపక్ష పార్టీలతో కూటమిగా పోటీ చేయనుంది. ఇందులో కాంగ్రెస్‌తో పాటు అస్సాం జాతీయ పరిషత్, రైజోర్ దళ్, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ ఉన్నాయి.