
అస్సాం బీజేపీలో చేరిన భూపేన్ కుమార్ బోరా
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, అస్సాం మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా ఆదివారం అధికార భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. గువాహటిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియా సమక్షంలో ఆయన పార్టీ కండువా ధరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా కూడా హాజరయ్యారు. ఇంతకు ముందు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఫిబ్రవరి 22న భూపెన్ బోరా బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన 32 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గుర్తుచేసుకున్న భూపెన్ బోరా, ఎమ్మెల్యేగా ప్రారంభమై అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా ఎదిగిన తన ప్రయాణాన్ని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూటములు ఏర్పరచడంలో తాను కీలక పాత్ర పోషించానని తెలిపారు.
నేనే చర్చలు ప్రారంభించాను. 11వ తేదీన గౌరవ్ గోగోయ్ ‘నువ్వు ఒక్కడివే వెళ్లొద్దు, రకీబుల్ హుస్సేన్‌ను కూడా తీసుకెళ్లు అన్నాడు. నేను అన్ని పార్టీలతో చర్చలు జరుపుతుండగా, 13వ తేదీన గౌరవ్ గోగోయ్ భూపేన్ బోరా అపోహలు సృష్టించారని ప్రకటించారు. అందరి ముందు నన్ను ఎందుకు అవమానించావని నేను అడిగినా సమాధానం రాలేదు. నేను ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి కూడా చెప్పాను. కానీ ఎవరూ స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. 2021లో తాను ఏపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్ )తో కూటమిలో ఉందని, ఆ కూటమిని తానే రద్దు చేశానని తెలిపారు. అనంతరం ఇండియా కూటమి ఏర్పడకముందే 16 పార్టీలతో విజయవంతంగా పొత్తులు కుదుర్చుకున్నానని చెప్పారు. 32 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి జీవితం అంకితం చేశాను. ఎమ్మెల్యే స్థాయి నుంచి ఏపీసీసీ అధ్యక్షుడిగా ఎదిగే అవకాశం కాంగ్రెస్ ఇచ్చింది. ఈ ఏడాది చివర్లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ పార్టీ తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
32 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు
అస్సాం రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ ప్రయాణం సాగించిన భూపేన్ కుమార్ బోరా తన రాజకీయ జీవితంలో రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బోరా 2006లో అస్సాంలోని బిహ్‌పురియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి విజయం సాధించారు. అనంతరం 2011లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకు విజయం లభించలేదు. దీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధిగా గెలిచింది మాత్రం రెండు సార్లే. అయినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆయన కీలక పాత్ర పోషించిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
భూపేన్ కు స్వాగతం తెలిపిన సీఎం
అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా బీజేపీలో చేరిన నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. భూపేన్ కుమార్ బోరా కాంగ్రెస్ పార్టీలో ఎంతో సేవ చేశారు. ఆయన 33 సంవత్సరాలు కాంగ్రెస్‌లో పనిచేశారు. ఈ రోజు నుంచి ఆయన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అస్సాంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బోరా బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
