
అస్సాం పర్యటనలో ప్రధాని మోడీ : రూ.5,450 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
ఈశాన్య భారత దేశ చరిత్రలో శనివారం ఒక మైలురాయిగా నిలవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు అస్సాంలో పర్యటించనున్నారు. ప్రధాని తన అస్సాం పర్యటనను ఈశాన్య భారత దేశంలోనే మొట్టమొదటిదైన దిబ్రూగఢ్‌లోని మోరన్ బైపాస్ వద్ద నిర్మించిన 'ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ' ప్రారంభోత్సవంతో మొదలుపెట్టనున్నారు. జాతీయ రహదారిపైనే విమానాలు దిగేలా రూపొందించిన ఈ 4.2 కిలోమీటర్ల ప్రత్యేక స్ట్రిప్‌పై ప్రధాని ప్రయాణించే వాయుసేన విమానం నేరుగా ల్యాండ్ కావడం ఒక చారిత్రాత్మక ఘట్టం కానుంది. ప్రధాని ఈ పర్యటనలో రూ. 5,450 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ
భారత వైమానిక దళం సమన్వయంతో అత్యవసర సమయాల్లో సైనిక, పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఇది విపత్తుల సమయంలో సహాయక చర్యల వేగవంతానికి, వ్యూహాత్మక అవసరాలకు కీలక ఆస్తిగా మారుతుంది. ఇది 40 టన్నుల బరువున్న యుద్ధ విమానాలను, 74 టన్నుల బరువున్న రవాణా విమానాలను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది
ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం, భారత వైమానిక దళం నిర్వహించే భారీ ఎయిర్‌షోను ప్రధాని వీక్షించనున్నారు. సుఖోయ్-30, రాఫెల్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, భారీ రవాణా విమానాలు, హెలికాప్టర్లు ఈ గగనతల ప్రదర్శనలో పాల్గొంటాయి. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఈ విన్యాసాలు భారత రక్షణ వ్యవస్థ యొక్క సన్నద్ధతను, వ్యూహాత్మక బలాన్ని చాటిచెప్పనున్నాయి.
బ్రహ్మపుత్రపై అద్భుత నిర్మాణం 'కుమార్ భాస్కర్ వర్మ సేతు'
దిబ్రూగఢ్ పర్యటన ముగించుకుని ప్రధాని గువహీటికి చేరుకుంటారు. అక్కడ బ్రహ్మపుత్ర నదిపై సుమారు రూ. 3,030 కోట్ల వ్యయంతో నిర్మించిన 'కుమార్ భాస్కర్ వర్మ సేతు'ను ఆయన సందర్శిస్తారు. ఆరు లేన్ల ఈ 'ఎక్స్‌ట్రాడోస్డ్' వంతెన గువహీటి, ఉత్తర గువహీటి మధ్య ప్రయాణ సమయాన్ని 7 నిమిషాలకు తగ్గించడమే కాకుండా, ఈ ప్రాంత రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఈశాన్య ప్రాంతంలో ఇటువంటి 'ఎక్స్‌ట్రాడోస్డ్ ప్రెస్ట్రెస్డ్ కాంక్రీట్' వంతెన ఇదే మొదటిది.
అస్సాం ప్రాంతంలో భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఈ వంతెన నిర్మాణంలో అత్యాధునిక 'ఫ్రిక్షన్ పెండ్యులం బేరింగ్స్' సాంకేతికతను వాడారు. ఇది తీవ్రమైన ప్రకంపనలను కూడా తట్టుకుని నిలబడుతుంది. అంతేకాకుండా, వంతెన పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 'బ్రిడ్జ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్' ను కూడా ఏర్పాటు చేశారు, ఇది భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.
డిజిటల్ ఇండియా దిశగా అమిన్‌గావ్ డేటా సెంటర్
కామరూప్ జిల్లాలోని అమిన్‌గావ్‌లో ఏర్పాటు చేసిన ఈశాన్య ప్రాంతపు తొలి 'నేషనల్ డేటా సెంటర్'ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. 8.5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ కేంద్రం ప్రభుత్వ శాఖల కీలక సమాచారాన్ని భద్రపరచడంతో పాటు, విపత్తుల సమయంలో డేటా రికవరీ సెంటర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో డిజిటల్ సేవలను మరింత వేగవంతం చేసి, ఈ-గవర్నెన్స్‌ను బలోపేతం చేయనుంది.
విద్యారంగంలో మైలురాయి - ఐఐఎం గువహీటి
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్' గువహీటి శాశ్వత క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి మేనేజ్మెంట్ విద్య చేరువవుతుంది. ఇప్పటికే ఐఐటీ, ఎయిమ్స్ కలిగిన అస్సాం, ఇప్పుడు ఐఐఎంను కూడా సొంతం చేసుకోవడం ద్వారా ఉన్నత విద్యలో సరికొత్త శిఖరాలను అధిరోహించనుంది.
పర్యావరణ హిత రవాణా: 225 ఎలక్ట్రిక్ బస్సులు
పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా 'పీఎం ఈ-బస్ సేవా' పథకం కింద 225 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో గువహీటి నగరానికి కేటాయించిన 100 బస్సులతో పాటు నాగ్‌పూర్, భావ్‌నగర్, చండీగఢ్ నగరాలకు కూడా బస్సులను ప్రారంభించనున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం తగ్గడమే కాకుండా పౌరులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
అభివృద్ధి మంత్రంతో ఎన్నికల శంఖారావం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన ముగింపులో ఆయన గువహీటిలోని ఖానాపరాలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మొత్తం రూ. 5,450 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ద్వారా ఈశాన్య రాష్ట్రాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే స్పష్టమైన సందేశాన్ని ప్రధాని ఈ పర్యటన ద్వారా ఇవ్వనున్నారు.
