Let's talk: editor@tmv.in
అస్సాం నుంచే కాంగ్రెస్‌కు బలమైన సమాధానం: ప్రధాని మోడీ

అస్సాం నుంచే కాంగ్రెస్‌కు బలమైన సమాధానం: ప్రధాని మోడీ

Pinjari Chand
19 జనవరి, 2026

మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి రికార్డు స్థాయి విజయం, కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బల నేపథ్యంలో, అస్సాం ప్రజల నుంచీ కాంగ్రెస్‌కు ‘కరారైన సమాధానం’ తప్పదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నాగావ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని, చొరబాట్ల అంశంలో రాజకీయ లాభాల కోసం కాంగ్రెస్ అస్సాం భూమి, భద్రత, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం, రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని మోడీ మాట్లాడుతూ కొన్ని ఓట్ల కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అస్పాం భూమిని చొరబాటుదారులకు అప్పగించింది. కాంగ్రెస్ దశాబ్దాల పాటు అసోంలో పాలించింది. ఆ కాలంలో చొరబాటు సమస్య మరింత పెరిగిందని అన్నారు. తన విమర్శలను మరింత తీవ్రతరం చేస్తూ దేశమంతటా కాంగ్రెస్‌కు ఒకే ఒక విధానం ఉంది. చొరబాటుదారులను రక్షించడం, వారి సహాయంతో అధికారంలోకి రావడం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా ఇదే పని చేస్తున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు.

బీహార్‌లో కూడా ఆందోళనలు చేశారు

బీహార్‌లో కూడా చొరబాటుదారులను కాపాడేందుకు ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించారు. కానీ బీహార్ ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా తిరస్కరించారు. ఇప్పుడు అసోం ప్రజల వంతు. ఈ నేల నుంచే కాంగ్రెస్‌కు గట్టి సమాధానం లభిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉందని మోడీ చెప్పారు. అస్పాంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆక్రమణల నుంచి భూమిని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటోందని ప్రధాని అన్నారు. ఈ రోజు ఇక్కడి బీజేపీ ప్రభుత్వం చొరబాటు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. మీ భూమిని ఆక్రమణల నుంచి రక్షిస్తోంది. ఇవన్నీ మీ ప్రయోజనాల కోసమే. కానీ కాంగ్రెస్ పాలనలో మాత్రం అధికార లాభాల కోసం ఈ భూమిని చొరబాటుదారులకు అప్పగించారని విమర్శించారు.

ఇటీవలి ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా ప్రజల తీర్పు చాలా స్పష్టంగా ఉంది. నేటి ఓటరు మంచి పాలన, అభివృద్ధిని కోరుకుంటున్నాడని మోడీ అన్నారు. ముంబైలో విజయం సాధించాం, కానీ సంబరాలు కాజీరంగాలో జరుగుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సభలో పెద్ద ఎత్తున చప్పట్లు వినిపించాయి.

అస్సాం గర్వకారణం కాజీరంగా

కాజీరంగా కేవలం జాతీయ ఉద్యానవనం మాత్రమే కాదు, అది అస్పాం ఆత్మ. ఇది భారత జీవవైవిధ్యానికి అమూల్యమైన రత్నం. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించిందని అన్నారు. ప్రకృతి పరిరక్షణతో పాటు ఆర్థిక అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.ప్రకృతిని కాపాడితే అవకాశాలు కూడా పెరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా కాజీరంగాలో పర్యాటకుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. హోమ్‌స్టేలు, గైడ్ సేవలు, రవాణా, హస్తకళలు, చిన్న వ్యాపారాల ద్వారా స్థానిక యువతకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తున్నాయని చెప్పారు. కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరిస్తూ వరదల సమయంలో వన్యప్రాణులను కాపాడేందుకు కలియాబోర్ నుంచి నుమలీగఢ్ వరకు 90 కిలోమీటర్ల పొడవున కారిడార్ నిర్మాణం జరుగుతోంది. సుమారు రూ.7,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 35 కిలోమీటర్ల ఎలివేటెడ్ రహదారి ఉంటుంది. వాహనాలు పైభాగంలో ప్రయాణిస్తాయి, కింద వన్యప్రాణుల కదలికకు ఆటంకం ఉండదని తెలిపారు.

కాజీరంగాలో వన్యప్రాణుల సంరక్షణలో సాధించిన విజయాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. ఒకప్పుడు కాజీరంగాలో గండభేరుండాల వేట పెద్ద సమస్యగా ఉండేది. 2013–14లో డజన్ల సంఖ్యలో ఒక్క కొమ్ము గండభేరుండాలు మృతి చెందాయి. బీజేపీ ప్రభుత్వం దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించింది. అటవీ శాఖకు అదనపు వనరులు, భద్రత పెంచింది. వన్ దుర్గా కార్యక్రమం ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని పెంచింది. ఫలితంగా 2025 నాటికి గండభేరుండాల వేటాడిన ఘటనలు ఒక్కటీ నమోదు కాలేదని తెలిపారు. అసోం ప్రభుత్వం, అక్కడి ప్రజలు వన్యప్రాణుల రక్షణకు చేసిన కృషికి ప్రశంసలు అందుకోవాలని ఆయన అన్నారు.

అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కలిసి సాగలేవనే భావనను తిరస్కరిస్తూ చాలా కాలంగా ప్రకృతి, ప్రగతి ఒకదానికి ఒకటి విరుద్ధమన్న భావన ఉంది. కానీ నేడు భారత్ ప్రపంచానికి రెండూ కలిసి ముందుకు సాగవచ్చని చూపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కూడా, పర్యావరణం కూడా అని అన్నారు. నాగావ్ జిల్లాలోని కలియాబోర్‌లో రూ.6,950 కోట్లకు పైగా విలువైన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే గువాహటి (కామాఖ్య)–రోహ్‌తక్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, డిబ్రూగఢ్–లక్నో (గోమతి నగర్) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు కొత్త రైళ్లను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు నాగావ్‌, కార్బీ ఆంగ్‌లాంగ్‌, గోల్‌ఘాట్ జిల్లాల గుండా సాగుతూ, ముఖ్యంగా డిబ్రూగఢ్‌, తిన్సుకియా వంటి అప్‌పర్ అసోం ప్రాంతాలకు అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని అధికారులు తెలిపారు.