
అస్సాం ఎన్నికల్లో యువతే లక్ష్యం
అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో అస్సాంలో రాజకీయ పార్టీలు యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక హామీలతో ముందుకు వస్తున్నాయి. ఉచిత విద్య, స్కాలర్‌షిప్పులు, ఉద్యోగ అవకాశాల వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ యువతను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం సుమారు 2.50 కోట్ల ఓటర్లలో 18–19 ఏళ్ల మధ్య వయస్సు గల కొత్త ఓటర్లు 6 లక్షలకు పైగా ఉండగా, 20–29 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లు సుమారు 66 లక్షల మంది ఉన్నారు. దీంతో యువ ఓటర్లు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు.
యువతను ఆకర్షించే పథకాలు
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు యువతను ఆకర్షిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా నిజుత్ మోయిన పథకం ద్వారా 11వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకునే బాలికలకు నెలకు రూ.2,500 వరకు స్కాలర్‌షిప్పు అందిస్తున్నారు. బాల్య వివాహాలు, డ్రాపౌట్స్ తగ్గించడమే ఈ పథకం లక్ష్యం. ఇదే తరహాలో బాలుర కోసం ముఖ్యమంత్రి నిజుత్ బాబు అసోని పథకాన్ని ప్రారంభించారు. ఇందులో అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అలాగే తాజా గ్రాడ్యుయేట్లకు సంవత్సరానికి రూ.25 వేల సహాయం అందించే జిబోన్ ప్రేర్‌ణ , పరిశోధన విద్యార్థులకు ఒకసారి స్కాలర్‌షిప్ ఇచ్చే జిబోన్ అనుప్రేర్‌ణ వంటి పథకాలు కూడా అమలులో ఉన్నాయి. ఇక యువతలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఛీప్ మినిస్టర్ ఆత్మనిర్భర్ అసోం అభియాన్, స్వయం వంటి కార్యక్రమాల ద్వారా వ్యాపారాలు ప్రారంభించేందుకు సీడ్ మనీ అందిస్తున్నారు.
ఇవి తాత్కాలిక పరిష్కారాలే
అయితే విద్యార్థి సంఘాలు ఈ పథకాలపై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఇవి తాత్కాలిక పరిష్కారాలే తప్ప విద్యా రంగంలోని నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించవని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎప్ఎఫ్ఐ) నేతలు అంటున్నారు. ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు తక్కువగా ఉండటం, స్వీయనిధి కోర్సులు పెరగడం వల్ల పేద విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు పేర్కొన్నారు. ఇక అధికారాన్ని తిరిగి సాధిస్తే ప్రస్తుత పథకాలను మరింత విస్తరిస్తామని బీజేపీ హామీ ఇస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల పెంపుపై దృష్టి పెట్టింది. మొత్తంగా యువతకు విద్యా అవకాశాలు, గౌరవప్రదమైన ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన అంశమని నిపుణులు సూచిస్తున్నారు. 126 సభ్యులున్న అస్సాం అసెంబ్లీకి ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనుండగా, ఓట్ల లెక్కింపు మే 4న చేపడతారు.
