Let's talk: editor@tmv.in
అస్సాంలో సీఈసీ ఎన్నికల ఏర్పాట్ల సమీక్ష

అస్సాంలో సీఈసీ ఎన్నికల ఏర్పాట్ల సమీక్ష

Pinjari Chand
19 ఫిబ్రవరి, 2026

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అస్సాంలో 2026 అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించారు. గత రెండు రోజులుగా ఎన్నికల కమిషన్ బృందం అస్సాంలో పర్యటిస్తూ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తోంది. ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఓటర్లకు అనుకూలమైన పలు చర్యలను ఈ సందర్భంగా ప్రకటించారు. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అందులో 98 సాధారణ (జనరల్) స్థానాలు కాగా, 19 షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ)లకు, 9 షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ)లకు రిజర్వ్ చేశారు. రాష్ట్ర జనాభా వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల నిర్వహణలో ప్రత్యేక ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు.

ఇటీవల పూర్తి చేసిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)పై సీఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకూడదనే లక్ష్యంతో ఈ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించామని, అలాగే అనర్హులు జాబితాలో చేరకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రత్యేక సవరణ సమయంలో విడుదలైన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో 2.52 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తుది పరిశీలన, క్లెయిమ్‌ల పరిశీలన, అవసరమైన మార్పులు, తొలగింపులు అనంతరం తుది జాబితాలో 2.49 కోట్ల మంది ఓటర్లు నమోదైనట్లు వెల్లడించారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎంలు)లో ఈసారి ముఖ్యమైన సాంకేతిక మార్పులు చేయనున్నట్లు సీఈసీ తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల రంగు ఫోటోలు ఈవీఎంలపై స్పష్టంగా ప్రదర్శిస్తారని, వారి పేర్లు, సీరియల్ నంబర్లు పెద్ద అక్షరాల్లో కనిపించేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది ముఖ్యంగా వృద్ధులు, చూపు సమస్యలున్న వారు, మొదటిసారి ఓటు వేయనున్న వారికి ఎంతో ఉపయుక్తమవుతుందని పేర్కొన్నారు. ఈసారి ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లకే పరిమితం చేస్తున్నాం. అలాగే అస్సాంలో తమ మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్ర ప్రవేశ ద్వారంలో భద్రపరచుకునే సదుపాయం తొలిసారి ఓటర్లకు కల్పిస్తున్నామని తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్​బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గువాహటిలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా, ఈసీఐ గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు వారి సూచనలు, అభిప్రాయాలు, ఆందోళనలు తెలుసుకుంది. సమావేశంలో పాల్గొన్న పార్టీలలో ఆప్, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ ఏఐయూడీఎఫ్ , అస్సాం గణపరిషత్, యూనైటైడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఉన్నాయి.