
అస్సాంలో రూ.500 కోట్ల భారీ పెట్టుబడికి సన్ ఫార్మా సిద్ధం
దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మాస్యూటికల్స్ అస్సాం రాష్ట్రంలో ఒక అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సుమారు రూ. 500 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 500 మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సన్ ఫార్మా సీనియర్ ప్రతినిధులు బుధవారం అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవి కోటాతో భేటీ అయ్యారు. భారతీయ మార్కెట్ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఈ యూనిట్‌లో డ్రగ్ ఫార్ములేషన్లను (మందుల మిశ్రమాలు) తయారు చేయనున్నారని, ఈ మొత్తం ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేస్తారని అధికారులు వెల్లడించారు.
ఈ సమావేశంలో భూమి కేటాయింపు, నీరు, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాలపై ప్రధానంగా చర్చించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, ఈ యూనిట్‌లో నీటి పొదుపు, పునరుత్పాదక ఇంధన వినియోగం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వంటి సుస్థిర పద్ధతులను పాటించనున్నట్లు సన్ ఫార్మా ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంచడంతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అస్సాం ప్రభుత్వం ఈ చర్చలు జరిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఉన్న సన్ ఫార్మా రాకతో ఈ ప్రాంతం ఫార్మా హబ్‌గా మారే అవకాశం ఉంది.
స న్ ఫార్మాస్యూటికల్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద, భారతదేశంలోనే అత్యంత పెద్ద ఔషధ కంపెనీ. దీనికి ఐదు ఖండాలలో 40కి పైగా తయారీ కేంద్రాలు ఉన్నాయి. 100 కంటే ఎక్కువ దేశాలలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ పెట్టుబడి ద్వారా అస్సాంలో పారిశ్రామిక వృద్ధి పెరగడమే కాకుండా, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉంది.
కాగా, సన్ ఫార్మాస్యూటికల్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాధులకు సంబంధించిన ఔషధాలను సరఫరా చేయడంలో అగ్రగామిగా ఉంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, మానసిక, నరాల వ్యాధులు, చర్మ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల చికిత్సలో వాడే మందులకు ఈ కంపెనీ పెట్టింది పేరు. ఇవే కాకుండా, క్యాన్సర్, కంటి సమస్యల నివారణకు అవసరమైన క్లిష్టమైన మందులను కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. మందుల తయారీకి కీలకమైన 'యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్' సరఫరాలో కూడా సన్ ఫార్మా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
సాధారణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వినియోగ వస్తువుల విభాగంలో కూడా ఈ సంస్థకు బలమైన బ్రాండ్లు ఉన్నాయి. కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలిగించే వోలిని జెల్, శారీరక శక్తిని రోగనిరోధక శక్తిని పెంచే రివైటల్, మల్టీ విటమిన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించే అబ్జార్బ్ పౌడర్ వంటివి భారతీయుల ఇళ్లలో విరివిగా వాడే ఉత్పత్తులు. నాణ్యత, విశ్వసనీయత కారణంగా వైద్యులు సైతం ఈ కంపెనీ మందులను రోగులకు ఎక్కువగా సిఫార్సు చేస్తారు.
