Let's talk: editor@tmv.in
అస్సాంలో యూసీసీ అమలు చేస్తాం: అమిత్ షా

అస్సాంలో యూసీసీ అమలు చేస్తాం: అమిత్ షా

Pinjari Chand
30 మార్చి, 2026

రాష్ట్రంలో అక్రమ చొరబాట్లను ఇప్పటికే అరికట్టినప్పటికీ, అది సరిపోదని, ప్రతి అక్రమ వలసదారుడిని దేశం నుంచి పంపించాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలోనే యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేస్తామని ప్రకటించారు. సోనిత్‌పూర్ జిల్లా ఢెకియాజులి, నల్బారి జిల్లాలోని తిహు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లలో అస్సాంలో చొరబాట్లను అరికట్టామని తెలిపారు. అయితే వచ్చే ఐదేళ్లలో ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం వెలుపలికి పంపిస్తామని చెప్పారు. అస్సాంలో యూసీసీ అమలు ద్వారా ఒకే విధమైన పౌర చట్టాలు అమలులోకి వస్తాయని, ముఖ్యంగా బహుపత్నిత్వాన్ని (ఒక వ్యక్తి పలువురిని వివాహం చేసుకోవడం) నియంత్రించడమే లక్ష్యమని వివరించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రంలో యాంటీ-పాలిగమీ చట్టం అమలులో ఉందని గుర్తు చేశారు.

భారీగా నిధులు ఇచ్చాం

కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన షా, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం గతంలో సరిహద్దులను తెరిచి ఉంచి రాష్ట్ర జనాభా నిర్మాణాన్ని మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఎన్నికల జాబితా సవరణలను వ్యతిరేకిస్తూ అక్రమ వలసదారులను కాపాడాలని చూస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకుంటోందని, అక్రమంగా ఆక్రమించిన 1.25 లక్షల ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోందని పేర్కొంటూ, ఉరి, పుల్వామా దాడులకు ప్రతిగా సర్జికల్‌ స్ట్రైక్స్‌ , బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌లు నిర్వహించామని గుర్తు చేశారు. అస్సాంలో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం కృషి చేసిందని, వేలాది మంది మావోయిస్టులు, మిలిటెంట్ గుంపుల సభ్యులు ఆయుధాలు వదిలి సాధారణ జీవితంలోకి వచ్చినట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్ పాలనలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు. అస్సాం అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, రాష్ట్రాన్ని చొరబాట్ల రహితంగా మార్చి శాంతి, అభివృద్ధి సాధించేందుకు ప్రజలు మళ్లీ బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. మొత్తం 126 స్థానాలకు ఓటింగ్ జరుగగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

మళ్లీ బీజేపీదే విజయం: నితిన్ నబిన్

అస్సాంలో బీజేపీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు బీజేపీ ప్రభుత్వ పనితీరుపై నమ్మకం ఉంచుతున్నారు. ఇది మళ్లీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంకేతం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించిన మన్‌కీబాత్‌ కార్యక్రమాన్ని ప్రశంసించిన నబిన్, దేశ ప్రజల అవసరాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మోడీ స్పష్టం చేశారని తెలిపారు. ప్రపంచ స్థాయి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా దేశం సాధారణ స్థితిలోనే ఉందని ప్రధాని భరోసా ఇచ్చారని చెప్పారు.