
అస్సాంలో భూకంపం..రిక్టర్ స్కేల్‌పై 4.8తీవ్రత
అస్సాం రాష్ట్రంలోని హైలాకాండీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.8గా నమోదైంది. మధ్యాహ్నం 2:18 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 5 కిలోమీటర్ల లోతులో నమోదైందని పేర్కొంది. దీని అక్షాంశం 24.823 ఉత్తరం, రేఖాంశం 92.634 తూర్పుగా గుర్తించారు. భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ప్రజలు భూకంప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. భూకంపాలు సాధారణంగా భూమి ఉపరితలం నుంచి సుమారు 700 కిలోమీటర్ల లోతు వరకు ఎక్కడైనా సంభవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లోతు ఆధారంగా భూకంపాలను మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. 0 నుంచి 70 కిలోమీటర్ల లోతులో సంభవించేవి తక్కువ లోతు (షాలో) భూకంపాలు, 70 నుంచి 300 కిలోమీటర్ల మధ్య జరిగేవి మధ్యస్థ (ఇంటర్మీడియేట్) భూకంపాలు, 300 నుంచి 700 కిలోమీటర్ల లోతులో సంభవించేవి లోతైన (డీప్) భూకంపాలుగా పరిగణిస్తారని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వివరించింది.
