Let's talk: editor@tmv.in
అస్సాంలో బీజేపీ సంకల్ప పత్రం విడుదల

అస్సాంలో బీజేపీ సంకల్ప పత్రం విడుదల

Pinjari Chand
1 ఏప్రిల్, 2026

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ మంగళవారం తన ‘సంకల్ప పత్రం’ (ఎన్నికల మేనిఫెస్టో)ను విడుదల చేసింది. ఈ కార్యక్రమం గువాహటిలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, సర్బనంద సోనోవాల్‌, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ సైకియా తదితరులు పాల్గొన్నారు. సంకల్ప పత్రాన్ని విడుదల చేసిన అనంతరం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేస్తామని తెలిపారు. అయితే ఇది ఆరో షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు వర్తించదని చెప్పారు. అలాగే ‘లవ్ జిహాద్’పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అస్సాంలో వరద సమస్యను తగ్గించేందుకు తొలి రెండు సంవత్సరాల్లో రూ.18,000 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రాన్ని వరదల రహిత అస్సాంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ, ఒక విశ్వవిద్యాలయం, ఒక ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసే లక్ష్యాన్ని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియా మాట్లాడుతూ సురక్షితమైన అస్సాం, అభివృద్ధి చెందిన అస్సాం నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. సంకల్ప పత్రం సిద్ధం చేయడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 2.45 లక్షల సూచనలు అందాయని తెలిపారు.

బీజేపీ పాలనలో అస్సాం అర్థిక వ్యవస్థ అభివృద్ధి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ గత పదేళ్లలో బీజేపీ పాలనలో అస్సాం ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2015–16లో రూ.2.24 లక్షల కోట్ల నుంచి 2025–26 నాటికి రూ.7.41 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇది దాదాపు 3.3 రెట్లు వృద్ధి అని ఆమె పేర్కొన్నారు. అస్సాం వ్యక్తిగత ఆదాయం 2020–21లో రూ.1.03 లక్షల నుంచి 2024–25లో రూ.1.59 లక్షలకు పెరిగిందని ఆమె వివరించారు. కాంగ్రెస్ పాలనలో కేంద్ర పన్నుల వాటాగా రాష్ట్రానికి సుమారు రూ.10,000 కోట్లు మాత్రమే వచ్చేవని, ప్రస్తుతం అది రూ.50,000 కోట్లకు పెరిగిందని తెలిపారు. అలాగే 2014 నుంచి ఇప్పటివరకు అస్సాంలోకి కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్లు కలిపి మొత్తం రూ.5.61 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి 50 సంవత్సరాల వడ్డీ లేని రుణంగా రూ.27,000 కోట్లు కూడా అందాయని పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర నదిపై కాంగ్రెస్ పాలనలో 50 సంవత్సరాల్లో మూడు వంతెనలు మాత్రమే నిర్మించగా, బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో తొమ్మిది వంతెనలు నిర్మించి, ఐదు నిర్మాణంలో ఉన్నాయని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, ఈ సంకల్ప పత్రం బీజేపీది మాత్రమే కాకుండా అస్సాం ప్రజల సూచనలతో రూపొందించిందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో అస్సాం అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున సహకరించిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది.