Let's talk: editor@tmv.in
అస్సాంలో నెహ్రు విగ్రహం ధ్వంసం

అస్సాంలో నెహ్రు విగ్రహం ధ్వంసం

Pinjari Chand
26 ఫిబ్రవరి, 2026

అస్సాం రాష్ట్రంలోని కాచార్ జిల్లాలో మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రు విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటన బరాక్ లోయ ప్రాంతంలోని పైలాపూల్ మార్కెట్ వద్ద, లక్షీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం ఎక్స్కవేటర్ సాయంతో విగ్రహాన్ని కూల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, విగ్రహం కూల్చేందుకు ఉపయోగించిన ఎక్స్కవేటర్‌ను స్వాధీనం చేసుకున్నామని, అయితే డ్రైవర్‌ను ఇంకా పట్టుకోలేకపోయామని లక్షీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శంకర్ దయాల్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

ఈ ఘటనపై అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ఒక విగ్రహాన్ని ధ్వంసం చేయడం కాదు. ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసిన స్వాతంత్ర్య సమరయోధుడి వారసత్వాన్ని అవమానించడం అని ఆయన పేర్కొన్నారు. నేరస్తులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుకానీ, ప్రజాస్వామ్య చరిత్రను చెరిపివేయాలనే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కావని గోగోయ్ అన్నారు. బీజేపీ పాలనలో ఇలాంటి ఘటన జరిగినప్పటికీ ప్రభుత్వం మౌనం పాటించడం ఆందోళనకరమని విమర్శించారు.

సిల్చర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సజల్ ఆచార్జీ ఈ ఘటన ముందస్తుగా ప్రణాళికతో జరిగిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజల్లో ఉద్రిక్తత సృష్టించేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు. స్థానిక సంఘాలు కూడా ఘటనను ఖండిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలు కాపాడాలని పోలీసులను కోరాయి. అస్సాం అసెంబ్లీకి 126 స్థానాల కోసం ఎన్నికలు ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉంది.