
అస్సాంలో తుది ఓటర్ జాబితా విడుదల
అస్సాం రాష్ట్రంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ–2026 (ప్రత్యేక సవరణ–2026) తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,49,58,139 మంది ఓటర్లు ఉన్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో), అస్సాం వెల్లడించిన వివరాల ప్రకారం, గతంలో విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో 2,52,01,624 మంది ఓటర్లు ఉండగా, పరిశీలన అనంతరం 2,43,485 పేర్లు తొలగించడంతో తుది సంఖ్యలో మార్పులు చోటు చేసుకున్నాయి. తుది ఓటర్ల జాబితాలో పురుష ఓటర్లు: 1,24,82,213, మహిళా ఓటర్లు: 1,24,75,583, తదితర ఓటర్లు: 343 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, ప్రత్యేక సవరణ–2026కు సంబంధించిన సమగ్ర డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను 2025 డిసెంబర్ 27న ప్రచురించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు 2025 నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి పరిశీలన విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. డిసెంబర్ 27, 2025 నుంచి 2026 జనవరి 22 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ జరిగిందని వివరించారు.
2.43 లక్షల ఓటర్ల తొలగింపు
అస్సాంలో 2026 శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో 2,43,485 మంది ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఉన్న 2,52,01,624 మంది ఓటర్ల సంఖ్య, తుది జాబితాలో 2,49,58,139కి తగ్గింది. ఇంటింటి పరిశీలన, మరణాలు, డూప్లికేట్ ఎంట్రీలు, చిరునామా మార్పులు వంటి కారణాల వల్ల ఈ తొలగింపులు జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే, తొలగించిన ఓటర్లలో ఎంతమంది బంగ్లాదేశీయులు ఉన్నారు అనే అంశంపై ఎన్నికల కమిషన్ ఎలాంటి అధికారిక గణాంకాలు విడుదల చేయలేదు. అర్హులైన వారు క్లెయిమ్స్–ఆబ్జెక్షన్స్ ప్రక్రియ ద్వారా తమ పేర్లు తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ సవరించింది. తుది ఓటర్ల జాబితా విడుదల తేదీని 2026 ఫిబ్రవరి 14కు వాయిదా వేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. విస్తృత స్థాయిలో జరుగుతున్న ఇంటింటి పరిశీలన, పోలింగ్ స్టేషన్‌ల పునర్వ్యవస్థీకరణ అవసరాల దృష్ట్యా ఈ గడువును పొడిగించినట్లు కమిషన్ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో 2025 డిసెంబర్ 11 నాటికి బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి పరిశీలన పూర్తి చేయగా, డిసెంబర్ 16న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది. అక్కడ 2026 జనవరి 15 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితా ఖచ్చితంగా ఉండేలా ప్రతి పౌరుడు ప్రత్యేక సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని ఎన్నికల కమిషన్ మరోసారి విజ్ఞప్తి చేసింది.
