Let's talk: editor@tmv.in
అస్సాంలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల

అస్సాంలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల

Pinjari Chand
28 డిసెంబర్, 2025

వచ్చే ఆరు నెలల్లో అస్సాంలో జరగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అనంతరం విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో 10.56 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించింది. ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసిన ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 2,51,09,754 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, ఇందులో 93,021 మంది డీ-ఓటర్లను చేర్చలేదు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం, తొలగించబడిన 10,56,291 ఓటర్లలో 4,78,992 మంది మరణించినవారు, 5,23,680 మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లినవారు, అలాగే 53,619 డూప్లికేట్ లేదా ఒకే విధమైన జనాభా వివరాలు ఉన్న ఎంట్రీలుగా గుర్తించారు.

డీ-ఓటర్లు అనేవారు అస్సాంలో పౌరసత్వంపై సందేహం ఉన్న వ్యక్తులుగా గుర్తించబడిన వర్గం. వీరి పౌరసత్వాన్ని విదేశీ చట్టం– 1946 కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రిబ్యునల్స్ నిర్ణయిస్తాయి. డీ-ఓటర్లకు ఓటు హక్కు ఉండదు. ఓటరు కార్డు జారీ చేయబడదు. అయితే, వారి పేరు, వయస్సు, ఫోటో వంటి వివరాలు ఎలాంటి మార్పులు లేకుండా డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఇచ్చారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి తనిఖీ నిర్వహించారు. ఈ ప్రక్రియలో 61,03,103 గృహాలను పరిశీలించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఈ వ్యాయామంలో 35 జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోస్), 126 ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోస్), 1,260 అసిస్టెంట్ ఈఆర్వోలు, 29,656 బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోస్) 2,578 బీఎల్వో సూపర్వైజర్లు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 61,533 బూత్ లెవెల్ ఏజెంట్లను (బీఎల్ఎస్) నియమించాయి. డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై ఓటర్లు తమ అభ్యంతరాలు లేదా సవరణలు దాఖలు చేయడానికి జనవరి 22 వరకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. అన్ని అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫిబ్రవరి 10న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,486 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఇతర రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కొనసాగుతున్నప్పటికీ, అస్సాంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా స్పెషల్ రివిజన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ అస్సాంలో పౌరసత్వానికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియ తుదిదశకు చేరుకుంటోందని పేర్కొన్నారు. ప్రత్యేక సవరణ లక్ష్యం అర్హులైన ఓటర్లను నమోదు చేయడం, తప్పుల్ని సరిదిద్దడం, మరణించినవారి పేర్లను తొలగించడం, చిరునామా మార్చిన ఓటర్లను గుర్తించడం, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడం ద్వారా తప్పులేని ఓటరు జాబితా రూపొందించడమేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.