

అస్సాంలో చొరబాటుదారులను కాపాడే చట్టం తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది: ప్రధాని
అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చొరబాటుదారులను రక్షించే చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. అయితే అలాంటి ప్రయత్నాలను బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవని ఆయన స్పష్టం చేశారు. బుధవారం అస్సాంలోని ధేమాజీ జిల్లాలో గోగాముఖ్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ, కాంగ్రెస్ లక్ష్యం మెజారిటీ వర్గాన్ని మైనారిటీలుగా మార్చి చొరబాటుదారులతో శాశ్వత ఓటు బ్యాంక్‌ను తయారు చేయడమేనని విమర్శించారు. బీజేపీ 2014లో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ కేంద్రంలో అలాంటి చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించిందని, అప్పటి ఎన్డీయే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అస్సాంలో చొరబాటుదారులను రక్షించే కొత్త చట్టాన్ని తెస్తామని బహిరంగంగా చెబుతున్నారని అన్నారు. దేశ విభజన సమయంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ చేసినట్లే దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
అలాగే రాజ్యాంగ రూపకర్త బీఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని మోడీ విమర్శించారు. కాంగ్రెస్‌కు ప్రజల ప్రయోజనాల కంటే కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని, ఢిల్లీలో ఒక కుటుంబం, అస్సాంలో మరో కుటుంబం పార్టీని నడుపుతున్నాయని అన్నారు. ఆయన వ్యాఖ్యలు గాంధీ, అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్‌గోగోయ్ కుటుంబాన్ని ఉద్దేశించినవిగా భావిస్తున్నారు.
అభివృద్ధికి కాంగ్రెస్ వ్యతిరేకం
బిస్వనాథ్ జిల్లాలోని బెహాలిలో మరో ఎన్నికల సభలో మాట్లాడిన మోడీ, కాంగ్రెస్ అస్సాం వనరులను సరైన విధంగా వినియోగించలేదని ఆరోపించారు. అయితే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను అభివృద్ధికి ఉపయోగిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండే పార్టీగా, అవినీతి జనని అని కూడా విమర్శించారు. అస్సాం ఆత్మ, గౌరవం, గుర్తింపు, భద్రతతో కాంగ్రెస్ రాజీ పడిందని అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సత్రాలు, నమఘర్‌లు, ఆలయాల భూములపై చొరబాటుదారులను స్థిరపరచి ఓటు బ్యాంక్ సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రోత్సహించిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం అక్రమ ఆక్రమణలను తొలగించే చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో అడవులు, అభయారణ్యాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయని, దాంతో ఒక కొమ్ము గల ఖడ్గమృగం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం ఈ సమస్యలపై కఠిన చర్యలు తీసుకుని పరిస్థితిని మార్చిందని అన్నారు. టీ తోటల కార్మికులకు ఇళ్ల నిర్మాణానికి భూమి హక్కులు కాంగ్రెస్ ఇవ్వలేదని విమర్శించారు. అస్సాంలో టీ పరిశ్రమకు 200 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ కాంగ్రెస్ పాలనలో కార్మికులు తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాల్సి వచ్చిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వారికి భూమి హక్కులు కల్పిస్తోందని తెలిపారు.
గిరిజన హక్కులను రక్షిస్తాం
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని, అలాగే అస్సాం గుర్తింపును కాపాడేందుకు ఆరో షెడ్యూల్ కింద గిరిజనుల హక్కులను రక్షిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ పదేళ్ల పాలనలో అస్సాంలో సేవా భావం, సుశాసనం ప్రారంభమైందని ఆయన అన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణంలో బీజేపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. గత 60–65 సంవత్సరాల్లో కాంగ్రెస్ బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలు నిర్మించగా, బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో ఐదు వంతెనలు నిర్మించిందని చెప్పారు. అస్సాంలో వనరుల కొరత లేదని, కానీ అధికారంలో ఉండేందుకు కాంగ్రెస్ అస్సామీయ సమాజాన్ని విభజించిందని ఆయన ఆరోపించారు. బ్రహ్మపుత్ర రెండు తీరాల ప్రజలు కలవకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, ఎన్డీయే ప్రభుత్వం వంతెనలు నిర్మించి ప్రజల కష్టాలను తగ్గించిందని అన్నారు. సుబన్సిరి జలవిద్యుత్ ప్రాజెక్టు అస్సాంను వరదల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని వరదల నుంచి రక్షించేందుకు బీజేపీ మేనిఫెస్టోలో సుమారు రూ.1,800 కోట్ల ప్రాజెక్టులను ప్రకటించినట్లు చెప్పారు. ప్రపంచానికి అస్సాం టీ కోసం ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇకపై జాగిరోడ్‌లో తయారయ్యే సెమీకండక్టర్ చిప్‌ల కారణంగా కూడా ప్రసిద్ధి చెందుతుందని అన్నారు.
టీ తోటలో మహిళలతో ప్రధాని సంభాషణ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అస్సాంలో ఇది తన తొలి పర్యటన అని ఆయన చెప్పారు. ప్రచారాన్ని టీ తోట సందర్శనతో ప్రారంభించి మహిళా కార్మికుల ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలిపారు. తన జీవితం టీతో అనుబంధమైందని, టీ ఆకులు ఎలా కోయాలో కూడా నేర్చుకున్నానని ‘చాయ్‌వాలా’ రోజుల్ని గుర్తుచేశారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం 22 లక్షలకు పైగా పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు కల్పించిందని, మరో 15 లక్షల కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని హామీ ఇచ్చింది. ప్రస్తుతం మూడు లక్షల మహిళలు ‘లఖ్‌పతి’గా ఉన్నారని, బీజేపీ ప్రభుత్వం కొనసాగితే ఆ సంఖ్యను 40 లక్షలకు పెంచుతామని ఆయన తెలిపారు. మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల కోసం బీజేపీ మేనిఫెస్టోలో స్పష్టమైన ప్రణాళిక ఉందని చెప్పారు.
బీజేపీ విభజన రాజకీయాలను నమ్మదని ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ సిద్ధాంతాన్ని అనుసరిస్తుందని మోడీ అన్నారు. అభివృద్ధి, వారసత్వం కోసం ప్రజలు ఓటు వేయాలని కోరారు. అస్సాంలో ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ మాత్రం ఓటముల శతకం పూర్తి చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అస్సాంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనుండగా, ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నారు.
