Let's talk: editor@tmv.in
అస్సాంలో కాంగ్రెస్ కూటమిదే అధికారం: మల్లికార్జున్‌ ఖర్గే

అస్సాంలో కాంగ్రెస్ కూటమిదే అధికారం: మల్లికార్జున్‌ ఖర్గే

Pinjari Chand
8 ఏప్రిల్, 2026

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి కనీసం 72–73 సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం గువాహటిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనను ‘అహంకారం నిండిన అవినీతి నాయకుడి’గా అభివర్ణించారు. శర్మ తనకు దగ్గరైన వారికి కంపెనీలు, టీ తోటలు, రిసార్టులు, అంతర్జాతీయ పాఠశాలలు నడిపే సిండికేట్‌ ఏర్పాటు చేశారని, వేలాది బీఘాల భూములు కూడా వారి చేతికి వెళ్లేలా చేశారని ఖర్గే ఆరోపించారు. 2026 అస్సాం ఎన్నికలు ప్రజలు, హిమంత బిశ్వ శర్మ మధ్య పోరాటంగా మారాయని ఆయన పేర్కొన్నారు. మాకు మార్పు కావాలి. ఇది ప్రజలు వర్సెస్‌ హిమంత బిశ్వ శర్మ పోరాటం. మేము కేవలం ప్రజలకు మద్దతుగా ఉన్నాం. మా సర్వే బృందాలు క్షేత్ర స్థాయి సమాచారం సేకరించాయి. ఈ ఎన్నికల్లో మేము 72–73 సీట్లు గెలుస్తాం. ఏప్రిల్‌ 9న ఓటు వేసి ప్రభుత్వాన్ని మార్చేందుకు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్నానని ఖర్గే అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అవినీతి పాలైందని ఆయన ఆరోపించారు. అస్సాం ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను ఎంతో ప్రేమిస్తారు. వారికి అహంకారంతో, అసభ్యంగా ప్రవర్తించే ముఖ్యమంత్రి అవసరం లేదు. ప్రజల అభివృద్ధి కోసం కాకుండా తన అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఈయనేనని విమర్శించారు.

బీజేపీ దత్తపుత్రుడు హిమంత బిశ్వ శర్మ

బీజేపీకి ‘దత్తపుత్రుడు’గా మారిన శర్మపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ ప్రారంభించలేదని ఖర్గే ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా , ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌లను ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అవినీతిని సహించమని చెబుతారు. ‘నా ఖౌంగా, నా ఖానే దూంగా’ అంటారు. అయితే మీ ‘దత్తపుత్రుడు’పై ఎందుకు విచారణ లేదు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి భార్య రింకీ భుయాన్‌ శర్మ నకిలీ పాస్‌పోర్ట్‌ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత పవన్‌ఖేరా నివాసానికి పోలీసులు వెళ్లిన విషయంపై కూడా ఖర్గే స్పందించారు. అరెస్టు చేయాలనుకుంటే చేయండి. మేము ఎదుర్కొంటాం. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. తర్వాత వారిని పార్టీలో చేర్చుకుని ‘వాషింగ్‌ మెషిన్‌’లో శుభ్రం చేసినట్లు చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎన్నికల హామీలను పునరుద్ఘాటించిన ఖర్గే, గాయకుడు జుబీన్‌ గార్గ్‌ మరణానికి న్యాయం చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. కేసును వేగవంతంగా విచారించే కోర్టును ఏర్పాటు చేసి 100 రోజుల్లో న్యాయం చేస్తామని తెలిపారు. అలాగే మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం అందించే ఒరునోడోయి పథకాన్ని కొనసాగించడమే కాకుండా అవసరమైతే పెంచుతామని అన్నారు.