
అస్సాంలో ఐదు జిల్లాల ఎస్‌ఎస్‌పీల బదిలీ
అస్సాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఐదు జిల్లాల సీనియర్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ)లను బదిలీ చేసింది. అధికారిక ప్రకటన ప్రకారం మాజులి, సౌత్ సల్మారా, సదియా, చిరాంగ్, ధేమాజీ జిల్లాల ఎస్‌ఎస్‌పీలను తక్షణమే మార్చినట్లు తెలిపింది. మాజులి ఎస్‌ఎస్‌పీ హరెన్ తొక్బి స్థానంలో సొమలిన్ సుబదర్శినిని నియమించారు. సౌత్ సల్మారా ఎస్‌ఎస్‌పీ మృణాల్ కుమార్ దేకా స్థానంలో ఆర్.శీతల్‌కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
సదియా ఎస్‌ఎస్‌పీ జగదీశ్ దాస్ స్థానంలో ఆంచల్ చౌహన్‌ను నియమించారు. చిరాంగ్ జిల్లా ఎస్‌ఎస్‌పీ దుర్భా బోరా స్థానంలో సుధాకర్ సింగ్‌ను, ధేమాజీ జిల్లా ఎస్‌ఎస్‌పీ స్వప్నీల్ దేకా స్థానంలో మోహన్‌లాల్ మీనాను నియమించారు. ఎన్నికల సన్నాహాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీఐ కార్యదర్శి రాజీవ్ రంజన్ అస్సాం చీఫ్ సెక్రటరీ రవికోటాకు పంపిన లేఖలో తెలిపారు. బదిలీ ఆదేశాలను వెంటనే అమలు చేసి, కొత్తగా నియమితులైన అధికారులు బాధ్యతలు స్వీకరించిన వివరాలను మంగళవారం ఉదయం 11 గంటలలోపు తెలియజేయాలని ఆదేశించారు.
బదిలీ చేసిన అధికారులను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలకు సంబంధించిన ఏ పోస్టుల్లోనూ నియమించకూడదని స్పష్టం చేశారు. బదిలీ చేసిన ఐదుగురు అధికారులు అస్సాం పోలీస్ సర్వీస్ (ఏపీఎస్)కు చెందినవారు కాగా, వారి స్థానాల్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారులను నియమించారు. ఇక రాష్ట్రంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఇప్పటికే పేర్కొన్నారు.
