Let's talk: editor@tmv.in
అస్సాంలో ఐదు గ్యారంటీలు అమలు చేస్తాం: ఖర్గే

అస్సాంలో ఐదు గ్యారంటీలు అమలు చేస్తాం: ఖర్గే

Pinjari Chand
30 మార్చి, 2026

అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే రాష్ట్ర ప్రజలకు ‘5 గ్యారంటీలు’ ప్రకటించారు. మహిళా సంక్షేమం, ఆరోగ్య భద్రత, భూ హక్కులు, న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ హామీలు రూపొందించినట్లు తెలిపారు. లఖింపూర్ జిల్లాలోని నవోయిచాలో జరిగిన బహిరంగ సభలో ఖర్గే మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెలా నగదు బదిలీ చేస్తామని ప్రకటించారు. అదనంగా వ్యాపారం ప్రారంభించేందుకు లేదా విస్తరించేందుకు ఆసక్తి ఉన్న మహిళలకు రూ.50,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ నగదు బదిలీకి ఎలాంటి షరతులు ఉండవని స్పష్టం చేశారు. ఇక ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 10 లక్షల స్థానిక ప్రజలకు శాశ్వత భూ పత్రాలు (పట్టాలు) ఇస్తామని, వృద్ధులకు నెలకు రూ.1,250 పింఛన్ అందిస్తామని తెలిపారు. అలాగే ప్రముఖ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ మరణానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

బీజేపీ అస్సాంను దోచుకుంటుంది

ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతి విస్తృతంగా పెరిగిందని, ప్రభుత్వ నేతలు తమ కుటుంబాల కోసం అధికారాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం పేరుతో అస్సాంను దోచుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఖర్గే విమర్శలు చేశారు. 2021 ఎన్నికల్లో సర్బానంద సోనోవాల్ నేతృత్వంలో పోటీ చేసిన బీజేపీ, తర్వాత ఆయనను పక్కనబెట్టి శర్మను సీఎం కుర్చీలో కూర్చోబెట్టిందని ఆరోపించారు. అందుకే శర్మ నకిలీ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రజలను విభజించే రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆరోపించారు. మొత్తంగా, అస్సాంలో అధికారాన్ని దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంక్షేమ హామీలతో ముందుకు వస్తుండగా, ఎన్నికల పోరు మరింత ఉత్కంఠగా మారుతోంది.