Let's talk: editor@tmv.in
అస్సాంలో ఉండేది ‘డబుల్‌ గులామీ’ ప్రభుత్వం: ప్రియాంకా గాంధీ

అస్సాంలో ఉండేది ‘డబుల్‌ గులామీ’ ప్రభుత్వం: ప్రియాంకా గాంధీ

Pinjari Chand
2 ఏప్రిల్, 2026

అస్సాంలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ వాద్రా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని వనరులన్నింటినీ ఒకే కుటుంబం దోచుకుంటోందని, కానీ ప్రజలకు మాత్రం ఏమీ దక్కడం లేదని ఆరోపించారు. అస్సాంలోని నజీరాలో జరిగిన ఎన్నికల సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అభ్యర్థి దేబ్‌బ్రత సైకియాకు మద్దతుగా ప్రచారం చేస్తూ ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తూ పాలన సాగిస్తోందని కూడా ఆమె ఆరోపించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ పై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చెప్పేది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని. కానీ వాస్తవానికి ఇది ‘డబుల్ గులామీ’ ప్రభుత్వం. మోడీ అమెరికాకు బానిసగా ఉంటే, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మోడీకి బానిసగా ఉన్నారని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. అస్సాంలోని గనులు, భూములు వంటి వనరులను పెద్ద పారిశ్రామిక వేత్తలకు అప్పగిస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీ పాలనలో అవినీతి విస్తృతంగా పెరిగిందని పేర్కొంటూ శారదా, స్మార్ట్ సిటీ, ఎన్‌సీ హిల్స్ వంటి పాత కుంభకోణాలను ప్రస్తావించారు.

టీ తోటల కార్మికుల రోజువారీ వేతనాలు పెంచుతామని బీజేపీ ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆమె విమర్శించారు. గిరిజన సముదాయాలకు ఎస్టీ హోదా ఇస్తామని చెప్పినా ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తు చేశారు. అస్సాంలో మహిళలను కూడా బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తున్నదని ప్రియాంకా ఆరోపించారు. ప్రధాని, ముఖ్యమంత్రి సభలకు హాజరు కాకపోతే ‘ఒరునొదోయ్’ వంటి ప్రభుత్వ పథకాల నుంచి పేర్లు తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆమె చెప్పారు. భయపెట్టి పాలన సాగించడమే మోడీ, హిమంత ప్రభుత్వాల విధానం. ఆ భయానికి వ్యతిరేకంగా పోరాడటం, అస్సాం సంస్కృతి, నాగరికతను కాపాడటం కోసం మా పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.

వనరులు ఉన్నా.. ప్రజలకు ఏమీ దక్కలేదు

టింగ్ఖోంగ్‌లో జరిగిన మరో ఎన్నికల సభలో కాంగ్రెస్ అభ్యర్థి బిఫుల్‌ గోగోయ్‌కి మద్దతుగా మాట్లాడిన ప్రియాంకా, అస్సాంలో భూమి, గనులు, అడవులు, ప్రకృతి వంటి అనేక వనరులు ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం ప్రయోజనం కలగడం లేదని అన్నారు. ఈ రాష్ట్రం మీకు అన్నీ ఇచ్చింది. కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం ఏమీ దక్కడం లేదు. ఒకే కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మాఫియా, సిండికేట్లు ప్రభావం పెరిగిందని, ప్రభుత్వం బెదిరింపులతో నడుస్తోందని ఆమె ఆరోపించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సింగపూర్‌లో ఈత కొడుతూ మరణించిన ప్రముఖ గాయకుడు జుబీన్‌గార్గ్‌ను ఆమె స్మరించారు. అస్సాం ఐక్యత, సోదరభావం, ప్రేమకు ఆయన గొంతుకగా నిలిచారు. కానీ ఆయన కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆయన కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.