
అస్సాంలోని ఆంగ్‌లాంగ్ మళ్లీ చెలరేగిన హింస
ఇప్పటికే ఉద్రిక్తతలతో అల్లాడుతున్న అస్సాంలోని కర్బీ ఆంగ్‌లాంగ్ జిల్లాలో మంగళవారం మరోసారి హింస చెలరేగింది. రెండు వర్గాల నిరసనకారులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది గాయపడగా, పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ, సోమవారం నిరసనల్లో దగ్ధమైన తమ దుకాణాలకు న్యాయం చేయాలని కోరుతూ మహిళలు, పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనకు దిగారు. మరోవైపు, గిరిజన బెల్ట్ ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణదారులను తరిమివేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు కూడా కేరోని మార్కెట్ ప్రాంతంలో గుమిగూడారు.
రెండు వర్గాలు ఆగ్రహంతో ఉండటంతో అక్కడ మోహరించిన భద్రతా బలగాలు పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించాయి. అయితే అకస్మాత్తుగా రెండు వైపుల నుంచీ రాళ్ల దాడులు మొదలయ్యాయి. ఈ ఘటనలో నిరసనకారులతో పాటు పలువురు పోలీసులు, ఘటనను కవరేజ్ చేస్తున్న మీడియా సిబ్బంది కూడా గాయపడ్డారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో పోలీసులు మొదట లాఠీచార్జ్, ఆపై టియర్ గ్యాస్ ప్రయోగించి గుంపులను చెదరగొట్టారు. ప్రస్తుతం ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అదనపు బలగాలను అక్కడికి పంపించినట్లు అధికారులు వెల్లడించారు. కేరోని ప్రాంతంలో నిరసనకారులు రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పంటించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ, కర్బీ ఆంగ్‌లాంగ్‌లో పరిస్థితి అత్యంత సున్నితంగా ఉంది అన్నారు. సీనియర్ మంత్రి రణోజ్ పెగు జిల్లాలోనే ఉన్నారని, త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిరాహార దీక్ష విరమించిన నిరసనకారులు
ఇదే రోజు గిరిజన బెల్ట్ ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణదారుల తొలగింపును డిమాండ్ చేస్తూ 15 రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షను నిరసనకారులు విరమించారు. మంత్రి పెగుతో జరిపిన చర్చల అనంతరం త్రైపాక్షిక సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో దీక్షను ముగించారు. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి కూడా హాజరవుతారని పెగు తెలిపారు.
సోమవారం జరిగిన హింసాత్మక ఘటనల్లో, నిరసనకారులు కర్బీ ఆంగ్‌లాంగ్ స్వయం పాలక మండలి (కేఏఏసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తులిరామ్ రొంగ్‌హాంగ్ నివాసంతో పాటు కేరోని బజార్‌లోని సుమారు 15 దుకాణాలను తగులబెట్టారు. పోలీస్ కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. అదే రోజు కేరోని పోలీస్ స్టేషన్‌పై దాడి ప్రయత్నం కూడా జరగగా, భద్రతా బలగాలు దాన్ని అడ్డుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో కర్బీ ఆంగ్‌లాంగ్‌తో పాటు పశ్చిమ కర్బీ ఆంగ్‌లాంగ్ జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించారు. కర్బీ ఆంగ్‌లాంగ్ జిల్లాలో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. మంత్రి పెగు సోమవారం రాత్రే కేరోని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డీజీపీ హర్మీత్ సింగ్ కూడా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పొరుగు జిల్లాల నుంచి అదనపు బలగాలను మోహరించినట్లు, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పెగు తెలిపారు.
చర్చల ద్వారానే పరిష్కరించాలి
గిరిజన ప్రాంతాల్లోని ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్ (పీజీఆర్), విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్ (వీజీఆర్) భూముల్లో బీహార్‌కు చెందినవారు అధికంగా అక్రమంగా స్థిరపడుతున్నారని నిరసనకారుల ఆరోపణ. గత ఏడాది తొలగింపు ప్రయత్నం జరగగా, గౌహతి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో అది నిలిచిపోయిందని మంత్రి తెలిపారు. సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈలోగా, నిరాహార దీక్షలో ఉన్న ముగ్గురు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారన్న వదంతులు వ్యాపించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. అయితే వారు అరెస్ట్ కాలేదని, ఆరోగ్యం క్షీణించడంతో గువాహటి మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఘటన వార్త వ్యాపించడంతో డోంకమోకామ్‌లోని కేఏఏసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాత నివాసాన్ని మరో వర్గం తగులబెట్టింది. ఈ సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులు జరపగా, ముగ్గురు ఆందోళనకారులు, ఒక పోలీసు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
