
అసెంబ్లీ ముట్టడికి బీఆర్‌ఎస్ యత్నం: మొక్కజొన్న రైతులకు మద్దతుగా పోరాటం
తెలంగాణ శాసనసభ వద్ద బుధవారం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొక్కజొన్న రైతులకు మద్దతుగా, కనీస మద్దతు ధర, బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన నిరసన ప్రదర్శన రణరంగంగా మారింది. గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ర్యాలీ నిర్వహించారు.
మార్షల్స్ తో తోపులాట.. హరీష్ రావుకు గాయం
అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు, అసెంబ్లీ మార్షల్స్ బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకోవడంతో పరిస్థితి విషమించింది. నిరసన చిహ్నంగా ఎమ్మెల్యేలు తమతో తెచ్చిన మొక్కజొన్న కంకులను మార్షల్స్ బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చేతికి తీవ్ర గాయమై రక్తం వచ్చింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీ గేటు వద్దే బైఠాయించి, ఇది పోలీసు రాజ్యమా? అంటూ నినాదాలు చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలు చేసి, అదనంగా రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
టి. హరీష్ రావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల మొక్కజొన్న, మామిడి తదితర పంటలకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. మార్కెట్ యార్డుల్లో ఎండబెట్టిన ధాన్యం తడిసి రైతులు నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్‌లో పంట బీమా గురించి చెప్పినా అమలు చేయలేదని, గత రెండేళ్లుగా రైతులకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టాలపై తక్షణమే నివేదికలు సేకరించి, రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, ఎంఎస్‌పీ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు రైతులు వరి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసారని, దాదాపు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందన్నారు. ఇప్పుడు మార్కెట్లోకి పంట వచ్చి 15 రోజులు దాటినా కొనుగోలు కేంద్రాలు తెరవలేదని విమర్శించారు.
మధ్యవర్తులకే లబ్ధి?
మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ. 2,400 ఉండగా, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు మధ్యవర్తులకు రూ. 1,600-1,700 కే అమ్ముకుని నష్టపోతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు పక్షమా లేక దళారుల పక్షమా? అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే జిల్లాల వారీగా పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు బోనస్‌తో కూడిన మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ పోరును మరింత ముదిరేలా చేసింది, రైతు సమస్యలను మరోసారి చర్చాంశనీయంగా మార్చింది.
