
అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన: స్పీకర్‌కు మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ నిబంధనలు పాటించకపోవడంతో పాటు సభ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు హౌస్ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ నియామకంపై ఎటువంటి స్పందన లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం కలిగించే అంశాలని హరీష్ పేర్కొన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) ప్రకారం స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఈ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని హరీష్ ఆరోపించారు.అలాగే, సభ్యులు అడిగే రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధమని, క్వశ్చన్ అవర్, జీరో అవర్‌ను తరచూ కుదిస్తూ సభ్యుల హక్కులను హరించుతున్నారని ఆయన విమర్శించారు. సభను అనవసరంగా వాయిదా వేస్తూ రూల్ 13, 16లను లెక్కచేయకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
డిప్యూటీ స్పీకర్ లేకపోవడం వల్ల ప్రివిలేజ్ కమిటీ పూర్తిగా నిర్వీర్యమైందని, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ కమిటీని పునరుద్ధరించకపోవడం సభ నిర్వహణలో పెద్ద లోపాన్ని సూచిస్తుందని హరీష్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు, శాసన వ్యవస్థ గౌరవానికి ఇది అనుకూలం కాదని హెచ్చరిస్తూ, ఏడాదికి కనీసం 30 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోరుతూ తమ లేఖను ముగించారు.
ఆర్టికల్ 191(2) ఏం చెబుతుంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) పదో షెడ్యూల్ ప్రకారం, ఒక రాష్ట్ర శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) తన పార్టీకి వ్యతిరేకంగా తిరిగబడినా లేదా స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదిలివేసినా, ఆ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించవచ్చు. ఈ అనర్హతపై తుది నిర్ణయం తీసుకునే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు ఉంటుంది. పార్టీ ఫిరాయింపులను నిరోధించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం.
