Let's talk: editor@tmv.in
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: అన్నామలై

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: అన్నామలై

Pinjari Chand
5 ఏప్రిల్, 2026

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే.అన్నామలై తాను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన పాత్ర పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడమేనని తెలిపారు. కేరళలో ఎన్నికల ప్రచారం ముగించుకుని చెన్నైకు చేరుకున్న ఆయన, శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిస్థితులపై సాధారణ చర్చ జరగనుందని చెప్పారు. ఏప్రిల్‌ 23న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సంబంధించి పార్టీ పంపిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం గురించి మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు. తాను ఎలాంటి నియోజకవర్గం నుంచీ పోటీ చేయనని ముందుగానే పార్టీకి లిఖితపూర్వకంగా తెలియజేశానని అన్నారు.

తాను కోరుకున్నట్లయితే తమిళనాడులో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసే అవకాశం ఉండేదని, కానీ ఈసారి ప్రచార బాధ్యతలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. పార్టీ తనకు పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 7 వరకు ప్రచారం చేసే బాధ్యత అప్పగించిందని, అనంతరం ఏప్రిల్‌ 23 వరకు తమిళనాడులో ప్రచారం కొనసాగిస్తానని చెప్పారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌గోయల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌.సంతోశ్‌, పార్టీ జాతీయ నాయకత్వానికి ముందుగానే తెలియజేశానని తెలిపారు. పార్టీ తన నిర్ణయాన్ని గౌరవించి, ఎన్డీయే అభ్యర్థుల విజయానికి ప్రచారం చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే 210 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ప్రచారం కొనసాగిస్తానని అన్నామలై పేర్కొన్నారు.