Let's talk: editor@tmv.in
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఢిల్లీయే మా లక్ష్యం: మమతా

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఢిల్లీయే మా లక్ష్యం: మమతా

Pinjari Chand
31 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను కేవలం అధికార పోరాటంగా కాకుండా ‘బెంగాలీ గుర్తింపు కోసం జరిగే పోరాటం’గా మార్చాలని ప్రయత్నిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రచార సభలో తీవ్రంగా బీజేపీపై విమర్శలు చేశారు. పశ్చిమ మిద్నాపూర్ జిల్లాలోని డెబ్రాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆమె, వచ్చే నెల ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసి ఢిల్లీని కూడా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.

బెంగాల్ వర్సెస్ ఢిల్లీ

ఈ ఎన్నికలను బెంగాల్ ప్రజల స్వాభిమాన పోరాటంగా మమతా బెనర్జీ చిత్రీకరించారు. కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం కలిసి రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను తగ్గిస్తూ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఢిల్లీలో ఉన్న వారు నా చేతిలోని అధికారాలన్నీ తీసేశారని ఆమె విమర్శించారు.

ఓటర్ల జాబితా సవరణపై ఆరోపణలు

ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌‌) ప్రక్రియను కూడా ఆమె రాజకీయ అంశంగా ప్రస్తావించారు. ప్రజలను క్యూల్లో నిలబెట్టారు. అవమానించారు. ఆ అవమానానికి ప్రజలు బ్యాలెట్ బాక్స్ ద్వారా సమాధానం చెబుతారని అన్నారు. లక్షలాది నిజమైన ఓటర్ల పేర్లు, ముఖ్యంగా మహిళలు, బెంగాలీ మాట్లాడే ప్రజల పేర్లు జాబితా నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు. మీ పేరు తొలగించారో లేదో ఆన్‌లైన్‌లో చూసి దరఖాస్తు చేయండి. అవసరమైతే మేము న్యాయ సహాయం కూడా అందిస్తామని ఆమె పేర్కొన్నారు. దాదాపు 60 లక్షల పేర్లలో లోపాలు ఉన్నాయని, వాటిలో కొంత భాగాన్ని తిరిగి చేర్చడంలో తమ పార్టీ న్యాయపోరాటం పాత్ర ఉందని కూడా ఆమె చెప్పారు.

మహిళా ఓటర్లపై దృష్టి

మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు కూడా మమతా ప్రయత్నించారు. తొలగించిన పేర్లలో ఎక్కువగా అమ్మలు, అక్కచెల్లెళ్ల పేర్లే ఉన్నాయి. పెళ్లి తర్వాత ఇంటిపేరు మారడం వల్ల వారికి సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా కులం, మతం, వర్గాలకతీతంగా అందరి మద్దతు కోరుతూ టీఎంసీ సామాజిక కూటమిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన అభ్యర్థుల కోసం ఎలా పోరాడతామో, హిందూ అభ్యర్థుల కోసం కూడా అలాగే పోరాడాలి. ముస్లిం అభ్యర్థులు ఉన్న చోట కూడా అలాగే చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మేమే ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు.

ఆహార సంస్కృతి అంశం

బీజేపీ బెంగాల్ ఆహార సంస్కృతిపై జోక్యం చేసుకుంటోందని మమతా ఆరోపించారు. బెంగాల్‌లో చేపలు, మాంసం, గుడ్లు తినకూడదని ఎందుకు చెబుతున్నారు? అయితే ప్రజలు ఏమి తినాలి? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ ఉత్తర భారతీయ హిందీ–హిందూ సంస్కృతిని బెంగాల్‌పై రుద్దాలని చూస్తోందని అన్నారు. బెంగాల్ ప్రముఖులను బీజేపీ గౌరవించడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ్, రాజా రామ్మోహన్ రాయ్, ఖుదీరాం బోస్ వంటి బెంగాల్ మహనీయులను ప్రస్తావించారు. 2019లో అమిత్ షా ర్యాలీ సమయంలో విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వారికి బెంగాల్ సంస్కృతి గురించి తెలియదని ఆమె విమర్శించారు. అలాగే స్వాతంత్ర్య సమరంలో బీజేపీ పాత్ర ఏమిటని కూడా ఆమె ప్రశ్నించారు.