Let's talk: editor@tmv.in
అసెంబ్లీలో స్పీకర్ వర్సెస్ కేటీఆర్: ఎమ్మెల్యేల అనర్హత వేటు తీర్పుపై చర్చ

అసెంబ్లీలో స్పీకర్ వర్సెస్ కేటీఆర్: ఎమ్మెల్యేల అనర్హత వేటు తీర్పుపై చర్చ

Gaddamidi Naveen
19 మార్చి, 2026

తెలంగాణ శాసనసభలో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడంపై కేటీఆర్ అసెంబ్లీ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ తరఫున దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే విషయంలో తీసుకున్న నిర్ణయంపై ఆయన విమర్శలు చేశారు. అయితే, ఆ ఎమ్మెల్యే పేరు ఆయన ప్రస్తావించలేదు.

దీనికి ప్రతిస్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తీర్పును పూర్తిగా చదవకుండా ఆరోపణలు చేయడం సరైంది కాదని సూచించారు. న్యాయవ్యవస్థలో తీర్పు వచ్చిన తర్వాత అసంతృప్తి ఉంటే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని గుర్తు చేశారు. తీర్పు చదవకుండా అనేక ఆరోపణలు చేయడం సముచితం కాదు. నేను ఈ విషయంపై మీడియాతో కూడా మాట్లాడలేదు. మీరు తీర్పు చదివిన తర్వాత మాట్లాడితే సమాధానం ఇస్తాను. అవసరం లేని ప్రశ్నలు అడగాలని, సభా నిబంధనలను అతిక్రమించవద్దని కేటీఆర్ కు సూచించారు.

ఇదిలా ఉండగా, స్పీకర్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ.. తమకు స్పీకర్ స్థానం పట్ల పూర్తి గౌరవం ఉందని, అయితే ఒక ఎమ్మెల్యేగా స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు తనకు ఉందని సమర్థించుకున్నారు.

ఇక రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కేటీఆర్ పేరును ప్రస్తావించకుండా స్పందిస్తూ, సభాధ్యక్షుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్నప్పటికీ, బీఆర్‌ఎస్ వరుస ఎన్నికల్లో ఓటములు ఎదుర్కొంటోందని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఫలితాలు ఆశించిన విధంగా లేవని అన్నారు.

అలాగే, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరినప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఏడాది మార్చి 11న, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి స్పీకర్ స్థాయిలో తెరపడింది. ఈ నిర్ణయమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీలో స్పీకర్ వర్సెస్ కేటీఆర్: ఎమ్మెల్యేల అనర్హత వేటు తీర్పుపై చర్చ - Tholi Paluku