
అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు పంపండి:శాసనసభ స్పీకర్
శాసనసభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు నిర్దేశిత గడువులోగా సమాధానాలు పంపాలని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. నేటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో వివిధ శాఖల కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు నెలల తరబడి సమాధానాలు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి జాప్యం జరగకుండా చూడాలని సమాధానాలను ఎప్పటికప్పుడు సభకు సమర్పించాలని ఆదేశించారు.
త్వరలో డిజిటల్ అసెంబ్లీ
కాగా వచ్చే వర్షాకాల సమావేశాల నాటికి అసెంబ్లీని 'నేషనల్ ఇ-విధాన్' కింద పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే దానికి సంబంధించిన పనులు ప్రారంభించి తదుపరి సమావేశాల నుంచి కాగిత రహిత (పేపర్ లెస్) విధానాన్ని అమలు చేస్తామన్నారు. తొలిరోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారని ఈ సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
నిఘా కోసం ప్రత్యేక పోర్టల్: సీఎస్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ సభలో సభ్యులు అడిగే ప్రశ్నలను పర్యవేక్షించేందుకు ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించినట్లు చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించి 283, మండలికి సంబంధించి 562 ప్రశ్నలకు సమాధానాలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని తక్షణమే పంపాలని కార్యదర్శులను ఆదేశించారు. వీటి పర్యవేక్షణ కోసం జీఏడీలో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మరోవైపు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎస్. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం వారం రోజుల్లోనే సమాధానాలు రావాల్సి ఉన్నా చాలా ఆలస్యమవుతోందని ఈ విషయంలో కార్యదర్శులు చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఎస్.ఎస్. రావత్, ఆర్.పి. సిసోడియా, బి.రాజశేఖర్ సహా పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత
అదేవిధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల పోలీసు ఉన్నతాధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తను ఆదేశించారు. ఎమ్మెల్యేల బస ప్రాంతాల నుంచి అసెంబ్లీ వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని సచివాలయ పరిసరాల్లో అత్యాధునిక సాంకేతికతతో నిఘా ఉంచాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా లోపాలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
