Let's talk: editor@tmv.in
అసెంబ్లీలో ప్రధాని మోదీపై సీపీఐ ఎమ్మెల్యే వ్యాఖ్యలు: భగ్గుమన్న బీజేపీ

అసెంబ్లీలో ప్రధాని మోదీపై సీపీఐ ఎమ్మెల్యే వ్యాఖ్యలు: భగ్గుమన్న బీజేపీ

Gaddamidi Naveen
4 జనవరి, 2026

తెలంగాణ శాసనసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ హయాంలో అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రద్దు చేసి, దాని స్థానంలో వీబీ జీ - రామ్‌ జీ చట్టాన్ని తీసుకురావడంపై జరిగిన చర్చ సందర్భంగా కూనంనేని ఈ వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం అసెంబ్లీలో ఉపాధి హామీపై తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సభలో ఉన్న బీజేపీ సభ్యులకు ఆగ్రహం తెప్పించాయి.దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఆ వ్యాఖ్యలను పరిశీలిస్తామని, అభ్యంతరకరంగా ఉన్న పక్షంలో వాటిని సభ రికార్డుల నుండి తొలగిస్తామని హామీ ఇచ్చారు.

బండి సంజయ్ తీవ్ర స్పందన

కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలానికి ఆదరణ తగ్గిపోయిందని, అలాంటి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలే దానికి కారణమని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అయితే కాంగ్రెస్, కమ్యూనిస్టు రాజకీయాలు విమర్శలు, దూషణలకే పరిమితమై అసంబద్ధంగా మారాయని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, ప్రధాన మంత్రికి క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఈ ఘటనతో తెలంగాణ శాసనసభలో కేంద్ర, రాష్ట్ర రాజకీయ వివాదం మరింత ముదిరినట్లైంది.

అసెంబ్లీలో ప్రధాని మోదీపై సీపీఐ ఎమ్మెల్యే వ్యాఖ్యలు: భగ్గుమన్న బీజేపీ - Tholi Paluku