
అసెంబ్లీలో ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసించింది. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు, కొత్త పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టమైన గడువును ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఇప్పటికీ గత ప్రభుత్వాన్నే నిందిస్తూ కాలం గడుపుతోందని ఆయన విమర్శించారు. ఐదు డీఏలు ఎప్పుడు ఇస్తారు? పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారు? సీపీఎస్ విషయంలో మీ నిర్ణయం ఏంటి? అని మేము సూటిగా ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు అని ఆయన విమర్శించారు.
తమ ప్రభుత్వ కాలంలో 88 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయినప్పటికీ అందరికీ పెన్షన్ ప్రయోజనాలు అందించామని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అలాంటి బాధ్యతను ఎప్పుడు నెరవేర్చుతుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు.
అసెంబ్లీలో హరీష్ రావు ఫిలిప్పిన్స్ బియ్యం ఎగుమతి అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. సీబీఐ, ఈడి కేసుల్లో ఉన్న ప్రేమ్ చంద్ ను ఎగుమతుల అడ్వైజర్‌గా నియమించారా? ఆయన సలహాల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందా? అనే ప్రశ్నలను లేవనెత్తారు. 10 లక్షల టన్నుల ఎంఓయూ చేసుకుని కేవలం 22,750 టన్నుల వద్దే ఎందుకు ఆగిపోయారని, మరో 7,500 టన్నులు ఏడాది నుంచి కాకినాడ పోర్టులో పాడైపోయాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతు సంక్షేమం, ఉద్యోగుల పీఆర్సీ, డీఏలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాలు నిలిచిపోయాయని, ప్రభుత్వ గణాంకాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు.
