Let's talk: editor@tmv.in
అసెంబ్లీలో 'ఆరు గ్యారంటీ'ల యుద్ధం

అసెంబ్లీలో 'ఆరు గ్యారంటీ'ల యుద్ధం

Gaddamidi Naveen
18 మార్చి, 2026

తెలంగాణ అసెంబ్లీ వేదికగా మంగళవారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య 'ఎన్నికల హామీల'పై మాటల యుద్ధం సాగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. దీనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రులు దీటుగా బదులిచ్చారు.

420 వరల్డ్ కప్ ఉంటే కాంగ్రెస్‌దే: కేటీఆర్ విమర్శలు

కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి వంచించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. భారత్ ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచింది. కానీ ఒకవేళ '420 వరల్డ్ కప్' ఉంటే, అది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ వారికే దక్కుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన “ఆరు గ్యారంటీలు” అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించి, దానికి సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారని, అయితే ఆ ఫైల్ ఇప్పుడు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. అంత ముఖ్యమైన ఫైల్ కనిపించకపోవడం అనుమానాస్పదమని, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.2.50 లక్షల లాభం కలుగుతుందని చెప్పిందని, ఇప్పుడు అలాంటి లాభం పొందిన ఒక కుటుంబాన్ని అయినా చూపగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా సామాజిక భద్రతా పెన్షన్లను రూ.4,000కు పెంచడం, దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగులకు భృతి వంటి హామీలు అమలు కాలేదని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించలేకపోతుందని, అభివృద్ధికి బదులుగా రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ఆయ‌న విమర్శించారు. మహిళల స్వయం సహాయక సంఘాలకు రూ.57,000 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని ప్రభుత్వం నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.

ప్రభుత్వం తరపున మంత్రుల కౌంటర్

దీనికి ప్రతిస్పందనగా పంచాయతీ రాజ్ మంత్రి దానసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, స్ట్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా మహిళా సంఘాలకు రూ.57,000 కోట్ల రుణాలు అందించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో కట్టుబడి ఉందని చెప్పారు. మహిళలను కోటీశ్వరులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. గతంలో మహిళలపై రూ.3000 కోట్ల వడ్డీ భారం మోపిందని విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించారు. సమ్మక్క-సారలమ్మ జాతరలో మహిళా సంఘాలకు అవకాశాలు కల్పించి లాభాలు పొందేలా చేశామని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో రూ. 5 లక్షలకు మించిన రుణాలకు కూడా వడ్డీలు చెల్లించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రిని కోరతానని సీతక్క పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ‘ఇందిరమ్మ’ గృహ నిర్మాణ పథకం కింద రూ.22,500 కోట్ల వ్యయంతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని వివరించారు. గతంలో ఇచ్చిన సాయం కంటే మెరుగ్గా, ప్రతి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల నేరుగా ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రాథమికంగా మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల పేదలకు సమానంగా న్యాయం జరుగుతుందన్నారు.

రైతులకు మద్దతుగా ‘రైతు భరోసా’ పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9,000 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. వ్యవసాయ పంటలకు బోనస్ ఇవ్వడంతో రైతులకు ఎకరాకు రూ.25,000 వరకు ఆదాయం లభించిందని చెప్పారు. అదేవిధంగా, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టలేదని విక్రమార్క ఆరోపించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, భూమిలేని పేదలకు మూడు ఎకరాల భూమి పంపిణీ, దళితుడిని ముఖ్యమంత్రిగా చేయడం, ప్రతి కుటుంబానికి ఉద్యోగం వంటి హామీలు అమలు కాలేదని అన్నారు.

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే కొత్త కార్డులు మంజూరు చేయడమే కాకుండా, పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. మొత్తానికి, ఆరు గ్యారంటీల అమలుపై సాగిన ఈ చర్చ అసెంబ్లీలో ఉత్కంఠ రేపింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో సభ హోరెత్తింది.