Let's talk: editor@tmv.in
అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు: త్రిష ఆగ్రహం

అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు: త్రిష ఆగ్రహం

Pinjari Chand
17 ఫిబ్రవరి, 2026

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ స్పందించారు. తనపై అసహ్యకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తమిళనాడు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారని పేర్కొంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకే చీఫ్, నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ పై విమర్శలు చేస్తూ, త్రిషను ఆయనతో అనుసంధానిస్తూ నాగేంద్రన్ వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమై, తీవ్ర విమర్శలకు గురయ్యాయి.

ప్రజా హోదాల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

ఈ నేపథ్యంలో త్రిష తన న్యాయవాదుల ద్వారా ఫిబ్రవరి 15న విడుదల చేసిన లీగల్ కమ్యూనికేషన్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘అవమానాన్ని సహించం… దాన్ని ఎప్పటికీ బహిరంగంగా నిలదీస్తాం’. అనే వ్యాఖ్యతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ప్రకటనను పోస్ట్ చేశారు. తాను ఎప్పటికీ రాజకీయంగా తటస్థంగా ఉన్నానని, ఎలాంటి రాజకీయ పార్టీతోనూ అనుబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదని ఆమె న్యాయ బృందం పేర్కొంది. త్రిషను రాజకీయ సంబంధాల ఆధారంగా నిర్వచించకూడదని, తనను సినిమాల్లో చేసిన పనుల ద్వారానే గుర్తించాలనుకుంటున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా హోదాల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా, సమతుల్యంగా వ్యవహరించాలన్నారు. ఈ వివాదంపై వివిధ వర్గాల నుంచి నయనార్ నాగేంద్రన్‌పై విమర్శలు వచ్చాయి. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ కనిమొళి కూడా ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో తిరునల్వేలిలో మీడియాతో మాట్లాడిన నాగేంద్రన్, ఆ వ్యాఖ్యలు ‘అజాగ్రత్తగా నోటి జారి వచ్చాయని’ తెలిపారు. నా రాజకీయ జీవితంలో ఎవరి వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయలేదు. ఆ రోజు మాట్లాడిన మాట పొరపాటున వచ్చింది. మహిళా మోర్చా నేత వనతి శ్రీనివాసన్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై నాతో మాట్లాడారు. ఎవరికైనా బాధ కలిగితే హృదయపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తున్నాను అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, టీవీకే కార్యకర్తలు నాగేంద్రన్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.