
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఆదివారం నాడు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) ప్రకారం, ఈ భూకంపం ఐదు కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఆదివారం సాయంత్రం 4.41 గంటలకు సంభవించిన ఈ భూకంపం గౌహతి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా కుదిపేసింది. భూకంప కేంద్రం ఉదల్గురి జిల్లాలో ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు కేవలం అస్సాంలోనే కాకుండా ఉత్తర బెంగాల్, భూటాన్ వంటి పొరుగు ప్రాంతాల్లో కూడా బలంగా వ్యాపించాయి. భూకంపం ధాటికి భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఈ భూకంపంపై స్పందించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు, సహాయక బృందాలు అప్రమత్తంగా ఉన్నారని, ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా, దేశంలో తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అస్సాం కూడా ఉంది. యురేషియన్ ప్లేట్ కింద భారత ప్లేట్ కలయిక వల్ల ఘర్షణ సంభవించే ప్రమాద జోన్ 5లో ఈ ప్రాంతం ఉంది. సెప్టెంబర్ 2న కూడా అస్సాంలోని సోనిత్పూర్లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
