
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎ.ఆర్.దామోదర్, జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశమై, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను వివరించి, నిర్వహించాల్సిన విధుల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ మమేకమై, ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని ప్రధాన నేరాలు, శాంతిభద్రతల సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అంశాలకు ప్రాధాన్యత కల్పించాలని, అసాంఘిక శక్తులను అణిచి వేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దుగా జిల్లా ఉండడం వలన గంజాయి అక్రమ రవాణా జరిగేందుకు అవకాశం ఉన్నందున వాటిని పూర్తిగా నియంత్రించి, గంజాయి అన్న పదం జిల్లాలో వినిపించకుండా చేయాలన్న ధృఢ సంకల్పంతో అధికారులు పని చేయాలన్నారు. మహిళలు, బాలల భద్రతకు రక్షణ కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
మహిళలు చేస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. మహిళలు, బాలల భద్రతను దృష్టిలో పెట్టుకొని క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. బాలలపై లైంగిక దాడులు జరగకుండా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కల్పించేందుకు ఎం.ఎస్.పి.లను క్షేత్ర స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం రూపొందించిన శక్తి (ఎన్.ఓ.ఎస్) యాప్ పట్ల, యాప్ను వినియోగించి పోలీసుల సహాయంను ఏవిధంగా పొందవచ్చునో మహిళలకు అవగాహన కల్పించే విధంగా శక్తి బృందాలు పని చేయాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలన్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న సైబర్ మోసాలు, నేరాల తీరును ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని, ఇందుకు ప్రత్యేకంగా వీడియోలను రూపొందించి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించి, వాటిని ప్రజలకు చేరువ చేస్తామన్నారు.
త్వరలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులను సమీక్షించి, నేరాల నియంత్రణకు లక్ష్యాలను నిర్దేశిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ట్రాఫిక్ రెగ్యులేషన్కు చర్యలు చేపడతామని, ఎం.వి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయాలని, ఈ-చలానాలను వాహనదారులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు విధులను నిర్వహించడంలో టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డ్రోన్స్, సిసి కెమెరాలను వినియోగించి నేరాల నియంత్రణ, చేధనకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా, సమర్ధవంతంగా అందించేందుకు సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది మానవత్వంతో వ్యవహరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలను, శక్తులను అణిచి వేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ దిశా నిర్ధేశం చేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్య రెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, డిటిసి డిఎస్పీ ఎం.వీర కుమార్, మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, పలువురు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
