Let's talk: editor@tmv.in
అష్విన్ బిగ్ బ్యాష్ డెబ్యూ షాక్.. మోకాలి ఆపరేషన్‌తో పూర్తి సీజన్ మిస్

అష్విన్ బిగ్ బ్యాష్ డెబ్యూ షాక్.. మోకాలి ఆపరేషన్‌తో పూర్తి సీజన్ మిస్

Koripelli Aditya
5 నవంబర్, 2025

భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అష్విన్ ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్ (బీబీఎల్)లో సిడ్నీ థండర్ తరపున ఆడే అవకాశం చెరిగిపోయింది. మోకాలి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకోవడంతో, ఈ సీజన్ మొత్తం ఆడలేకపోతున్నాడు. బీబీఎల్‌లో ఆడిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం చేజారిపోయింది.

ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన తర్వాత, విదేశీ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడేందుకు అందుబాటులోకి వచ్చిన అష్విన్, ఐఎల్‌టీ20 ఆక్షన్‌లో ఎవరూ కొనకపోవడంతో పూర్తి బీబీఎల్ సీజన్‌కు సిడ్నీ థండర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. చెన్నైలో శిక్షణ సందర్భంగా మోకాలికి గాయమైంది. ఆపరేషన్ అనంతరం రికవరీకి ఎక్కువ సమయం పడుతుందని తేలియడంతో, బీబీఎల్ 15కి అందుబాటులో ఉండలేకపోతున్నాడు.

‘బీబీఎల్ 15 మిస్ అవడం బాధ కలిగించింది. ఇప్పుడు రికవరీపైనే దృష్టి పెట్టాను. మళ్లీ బలంగా తిరిగి వస్తాను. థండర్ ఫ్యామిలీ, అభిమానులు చూపిన ఆత్మీయతకు కృతజ్ఞుడిని. ట్రెంట్ మేనేజ్‌మెంట్ మొదట మాట్లాడిన నుంచీ క్లబ్‌లో భాగమైన అనుభూతి కలిగించారు’ అంటూ అష్విన్ థండర్ ప్రకటనలో పేర్కొన్నాడు.

అంతేకాదు, ‘పురుషులు, మహిళల జట్ల మ్యాచ్‌లను టీవీలో చూస్తూ చీర్స్ చెబుతాను. రికవరీ, ట్రావెల్ ప్లాన్ సరిపడితే, డాక్టర్లు ఓకే చెప్పితే సీజన్ చివర్లో గ్రూప్‌తో కలిసి అభిమానులను కలుస్తాను. ఇరు జట్లకి భారీ విజయాన్ని కోరుకుంటున్నా, అని తెలియజేశారు.

సిడ్నీ థండర్ జనరల్ మేనేజర్ ట్రెంట్ కోప్‌ల్యాండ్ మాట్లాడుతూ, ‘అష్ గాయం గురించి తెలిసి క్లబ్‌లో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యాం. రికవరీలో ఆయనకు మా మద్దతు ఉంటుంది. మొదటి సంభాషణ నుంచీ థండర్ పట్ల ఆయన నిబద్ధత స్పష్టం. బీబీఎల్ 15లో డగౌట్‌లో ఆయన్ను ఆహ్వానించి, ఫ్యాన్స్‌కు పరిచయం చేసి, దీర్ఘకాలిక సంబంధం కొనసాగించాలని ఆశిస్తున్నాం’.

‘క్లబ్‌కు నిరాశే అయినా.. మేం రెండు చాంపియన్ జట్లను తయారు చేశాం. గత సీజన్ల పురోగతిని డబ్ల్యూబీబీఎల్ 11, బీబీఎల్ 15లో కొనసాగిస్తాం. వెస్ట్రన్ సిడ్నీ అభిమానుల ముందు రెండు భారీ క్యాంపెయిన్‌లకు సిద్ధం’ అని కోప్‌ల్యాండ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ గాయంతోనే అష్విన్, నవంబర్ 07న ప్రారంభమయ్యే హాంకాంగ్ సూపర్ సిక్సెస్ టోర్నీని కూడా మిస్ చేయనున్నాడు. థండర్ ఇప్పుడు ఇంజ్యూరీ రీప్లేస్‌మెంట్ తీసుకునే అవకాశం ఉంది. అయితే స్పిన్ విభాగంలో క్రిస్ గ్రీన్, తన్వీర్ సంఘా, పాకిస్తాన్ స్టార్ షాదాబ్ ఖాన్, టామ్ ఆండ్రూస్ ఉండటంతో బలమైన ఆప్షన్లు సిద్ధంగానే ఉన్నాయి.

బీబీఎల్ చరిత్రలో భారత క్రికెటర్ సైన్ చేసిన భారీ డీల్, ఇలా ఆరంభానికి ముందే ఆగిపోవడం థండర్ నేషన్‌కు షాక్ ఇచ్చింది. అయినా అష్విన్ ఆఫ్ ఫీల్డ్ యాక్టివిటీలతో జట్టుకు మద్దతిస్తానని హామీ ఇవ్వడం, ఫ్యాన్స్‌కు ఊరట నిచ్చింది. రికవరీ తర్వాత మళ్లీ మైదానంలో ధూంధాం చూపేందుకు అష్విన్ సిద్ధంగా ఉన్నాడు.