
అవిముక్తేశ్వరానందపై పోక్సో కేసు నమోదు చేయాలని కోర్టు ఉత్తర్వులు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పీఓసీఎస్‌ఓ(పోక్సో) కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్యోతిష్ పీఠ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై మైనర్లపై లైంగిక దోపిడీ ఆరోపణల నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. శనివారం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఝూన్సీ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత చట్టాల కింద వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు కోర్టు దిశానిర్దేశం చేసింది.
ఈ ఫిర్యాదును శాకుంభరీ పీఠాధీశ్వరుడు అశుతోష్ బ్రహ్మచారి మహారాజ్ దాఖలు చేశారు. ఆయన సెక్షన్ 173(4) కింద దరఖాస్తు సమర్పిస్తూ, ఝూన్సీ పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. స్వామి అవిముక్తేశ్వరానంద ఆశ్రమంలో మైనర్ పిల్లలపై లైంగిక దోపిడీ జరిగిందని ఆరోపిస్తూ, ఆధారాలుగా సీడీని కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 13న ఇద్దరు మైనర్ ఫిర్యాదుదారుల వాంగ్మూలాలను వీడియో గ్రఫీ ద్వారా కోర్టు నమోదు చేసింది. పోలీస్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుని తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు, శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దర్యాప్తు నిష్పాక్షికంగా, స్వతంత్రంగా జరగాలని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా పీఓసీఎస్‌ఓ చట్టంలోని బాధితుల గోప్యత, గౌరవం కాపాడే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. కోర్టు ఈ కేసు విషయార్ధంపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని, దర్యాప్తు సంస్థ చట్ట ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని కూడా ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలుపై చట్టబద్ధ గడువులోగా కంప్లయన్స్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు సూచించింది. ఈ పరిణామం ఉత్తరప్రదేశ్ రాజకీయ, మత వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కేసు కల్పితం: అవిముక్తేశ్వరానంద
తనపై నమోదవుతున్న పోక్సో ఆరోపణల నేపథ్యంలో జ్యోతిష్ పీఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్పందించారు. కోర్టు తన విధి ప్రకారం ఫిర్యాదును నమోదు చేసి దర్యాప్తు చేస్తుందని, తాము ఇప్పటికే ఈ కేసు కల్పితమని కోర్టుకు తెలియజేశామని తెలిపారు. కోర్టుకు తన సొంత ప్రక్రియ ఉంది. ఫిర్యాదు నమోదు అయిన తర్వాత దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసు అబద్ధం, కల్పితమని స్వామి పేర్కొన్నారు.
ఫిర్యాదుదారుడిగా ఉన్న అశుతోష్ బ్రహ్మచారి మహరాజ్(అశుతోష్ పాండే)పై కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో కంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో అతను ‘హిస్టరీ-షీటర్’గా నమోదు అయ్యాడని, గతంలోనూ పలువురిపై తప్పుడు కేసులు వేశాడని ఆరోపించారు. తానే బాధితులమని చెప్పుకునే అనేక మంది అతనిపై తప్పుడు కేసుల ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఇక తనపై వచ్చిన ఆరోపణల వెనుక అంతర్గత కుట్ర ఉందని స్వామి వ్యాఖ్యానించారు. సనాతన ధర్మానికి బయటి శక్తుల నుంచి ప్రమాదం లేదు. లోపల నుంచే హిందూ మతాన్ని, శంకరాచార్య వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నందున కోర్టు ఇప్పటివరకు కేసు విషయార్ధంపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. దర్యాప్తు ఫలితాలపై ఆధారపడి తదుపరి చర్యలు ఉండనున్నాయి.
