Let's talk: editor@tmv.in
అవినీతి సూచీలో 91వ స్థానంలో భారత్‌

అవినీతి సూచీలో 91వ స్థానంలో భారత్‌

Shaik Mohammad Shaffee
12 ఫిబ్రవరి, 2026

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల్లో అవినీతిపై బెర్లిన్ కేంద్రంగా పనిచేసే గ్లోబల్ ఎన్జీఓ 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్' మంగళవారం విడుదల చేసిన 2025 అవినీతి సూచీలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. గతేడాది 96వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి ఐదు స్థానాలు ఎగబాకి 91వ స్థానానికి చేరుకుంది. మొత్తం 182 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ తన స్కోరును ఒక పాయింట్ పెంచుకోవడం గమనార్హం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అవినీతి వ్యతిరేక ప్రగతి నెమ్మదిగా సాగుతోందని, అనేక దేశాల్లో పాలకుల తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని నివేదిక పేర్కొంది.

అగ్రస్థానంలో డెన్మార్క్.. అట్టడుగున సోమాలియా

అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో డెన్మార్క్ 89 పాయింట్లతో వరుసగా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, సింగపూర్ నిలిచాయి. అత్యంత అవినీతిమయమైన దేశాల జాబితాలో దక్షిణ సూడాన్, సోమాలియా (9 పాయింట్లు) అట్టడుగున నిలవగా, వెనిజులా ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇక ప్రపంచ అగ్రరాజ్యాల్లో అమెరికా 29వ స్థానంలో, బ్రిటన్ 20వ స్థానంలో నిలిచాయి. అయితే అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ వంటి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో కూడా పారదర్శకత ప్రమాణాలు క్షీణిస్తుండటంపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

జర్నలిస్టుల భద్రతపై ఆందోళన

అవినీతిపై నిలదీసే జర్నలిస్టులకు భారత్ ప్రమాదకరమైన దేశంగా ఉందని నివేదిక హెచ్చరించింది. 2012 నుంచి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లేని దేశాల్లో సుమారు 829 మంది జర్నలిస్టులు హత్యకు గురవ్వగా, అందులో 90 శాతం దాడులు భారత్, పాకిస్థాన్, బ్రెజిల్ వంటి అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లోనే జరిగాయి. జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు పాలకులు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని, దీనివల్ల దేశంలో అవినీతి మరింత పెరిగిపోతోందని నివేదిక స్పష్టం చేసింది. నిజాలను వెలికితీసే వారి గొంతు నొక్కితే వ్యవస్థలో జవాబుదారీతనం లోపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

పడిపోతున్న ప్రపంచ సగటు

ప్రపంచవ్యాప్తంగా అవినీతి సగటు స్కోరు 42 పాయింట్లకు పడిపోవడం గమనార్హం. మూడింట రెండు వంతుల దేశాలు 50 కంటే తక్కువ స్కోరునే సాధించాయి. అవినీతి వల్ల ఆసుపత్రులకు నిధులు అందకపోవడం, వరదల రక్షణ ఏర్పాట్లు కుంటుపడటం వంటి పరిణామాలతో సామాన్యులే మూల్యం చెల్లించుకుంటున్నారని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది. పౌర సమాజం, ఎన్జీఓలు, జర్నలిస్టుల గొంతు నొక్కడం ద్వారా పాలకుల అక్రమాలకు మార్గం సుగమం అవుతోందని విశ్లేషించింది.