Let's talk: editor@tmv.in
అవినీతి వల్లే ఇండోర్ విషాదం: రాజేంద్ర సింగ్

అవినీతి వల్లే ఇండోర్ విషాదం: రాజేంద్ర సింగ్

Pinjari Chand
5 జనవరి, 2026

కలుషిత తాగునీటి కారణంగా ఇండోర్‌లో పలువురు మృతి చెందడం ఒక ‘వ్యవస్థాపిత విపత్తు’ అని ప్రముఖ జల సంరక్షణ నిపుణుడు, మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ తీవ్రంగా విమర్శించారు. లోతుగా వేళ్లూనుకున్న అవినీతే ఈ విషాదానికి ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ‘వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన రాజేంద్ర సింగ్, దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా గుర్తింపు పొందిన ఇండోర్‌లో ఇలాంటి ఘటన జరగడం ఆందోళనకరమన్నారు. అత్యంత పరిశుభ్రమైన నగరంలోనే ఈ పరిస్థితి ఉంటే, మిగతా నగరాల్లో తాగునీటి సరఫరా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు అని ఆయన పీటీఐకి తెలిపారు.

విషాదం జరిగిన తీరు

భాగీరథ్‌పురా ప్రాంతంలో ప్రధాన తాగునీటి పైపులో పెద్ద లీక్‌ గుర్తించారు. పోలీస్ అవుట్‌పోస్ట్‌లో నీటి పైపులపై మరుగుదొడ్డి నిర్మించడంతో, మురుగు నీరు తాగునీటిలో కలిసిపోయిందని అధికారులు వెల్లడించారు. దీనివల్ల వాంతులు, విరేచనాలతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అధికారికంగా ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్లు ప్రకటించగా, స్థానికులు మాత్రం మృతుల సంఖ్య 10 నుంచి 14 వరకు ఉండవచ్చని చెబుతున్నారు. మరో 200 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 30 మందికి పైగా ఐసీయూలో ఉన్నారు.

అసలు కారణం అవినీతే

ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు తాగునీటి పైపులను డ్రైనేజ్ లైన్లకు అతి దగ్గరగా వేస్తున్నారు. ఇదే ఇలాంటి ప్రమాదాలకు కారణమని రాజేంద్ర సింగ్ ఆరోపించారు. అవినీతి మొత్తం వ్యవస్థను నాశనం చేసిందని, ఇండోర్ ఘటన దానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. నర్మదాపై ఆధారపడటం, ఇండోర్‌లో భూగర్భజల మట్టాలు ఏటా పడిపోతుండటం అత్యంత ఆందోళనకరమని రాజేంద్ర సింగ్ చెప్పారు. నేను 1992లో తొలిసారి ఇండోర్‌కి వచ్చినప్పుడు కూడా నర్మదా నీటిపై ఎంతకాలం ఆధారపడతారని ప్రశ్నించాను. ఇన్నేళ్లయినా అదే పరిస్థితి అంటే బాధ్యతాయుతమైన నీటి నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేకపోవడమే అని వ్యాఖ్యానించారు.

భారీ ఖర్చు – అధిక వృథా

ఇండోర్ తాగునీటి అవసరాల కోసం ఖర్గోన్ జిల్లా జాలుడ్ నుంచి 80 కిలోమీటర్ల దూరం నుంచి నర్మదా నీటిని పైపుల ద్వారా తెస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విద్యుత్ బిల్లులకే నెలకు సుమారు రూ.25 కోట్లు ఖర్చవుతోందని అధికారులు తెలిపారు. ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ వ్యయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇండోర్ ఆసియాలోనే అత్యంత ధనిక నగరం. మేం లీటర్‌కు కాదు, కిలోలీటర్‌(వేయి లీటర్ల)కు రూ.21 విలువైన నీటిని తాగుతున్నాం. నీరు కాదు, నెయ్యి తాగుతున్నట్లే అని ఆయన 2024 జూన్ 27న జరిగిన ఒక సదస్సులో వ్యాఖ్యానించారు.