Let's talk: editor@tmv.in
అవినీతి పరులు బీజేపీలో చేరి పవిత్రులెట్లవుతున్నారు: సీఎం స్టాలిన్

అవినీతి పరులు బీజేపీలో చేరి పవిత్రులెట్లవుతున్నారు: సీఎం స్టాలిన్

Pinjari Chand
19 అక్టోబర్, 2025

తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ కేంద్రాన్ని ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాజెక్టులు, చట్టాలకు హిందీ, సంస్కృత పేర్లు పెట్టడం, కొంతమంది అవినీతి పరులు బీజేపీలో చేరిన తర్వాత పవిత్రులవడం పై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇంకా ఈ విధంగా కేంద్రాన్ని ముఖ్యంగా బీజేపీపై శనివారం పలు ప్రశ్నలు సంధించారు.

స్టాలిన్ ఎక్స్ లో ఈ విధంగా పోస్ట్ చేశారు.

• ఎన్డీయే కూటమి లో చేరగానే అవినీతి వ్యక్తులు ‘వాషింగ్ మెషీన్’లో బట్టలు శుభ్రం అయినట్లు ఎలా పునీతులవుతున్నారు.?

• దేశంలోని ప్రాజెక్టులు, చట్టాలకు హిందీ, సంస్కృత పేర్లు పెట్టడం ఇదేమి అహంకారం?(ఆత్మనిర్భర్ భారత్, వందే భారత్, అంత్యోదయ)

• కేంద్ర మంత్రులు పిల్లలకు శాస్త్ర విరుద్ధమైన మూఢనమ్మకాలను ఎందుకు చెబుతున్నారు?

• ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా గొడవలు సృష్టించి, ఏం సాధించాలనుకుంటున్నారు?

• బీజేపీ ఎన్నికల్లో గెలవడానికి ప్రజల ఓట్లను చోరీ చేసేందుకే సర్ కు మద్దతు ఇస్తోందా?

• తమిళనాడు శాస్త్రీయ నివేదిక ద్వారా నిరూపితమైన ఇనుప రాతి యుగాన్ని ఎందుకు అంగీకరించక పోతున్నారు?

• కీళాడి నివేదికను అణగదొక్కడానికి కారణాలు ఏంటి?

• ఈ ప్రశ్నలకు సమాధానం వస్తుందా, లేక ఎప్పటిలాగే వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా తప్పుడు ప్రచారం మొదలుపెడతారా?"

కీళాడి** **నివేదిక

తమిళనాడులోని కిలాడి అనే ప్రాంతంలో జరిపిన పురావస్తు అన్వేషణలో వచ్చిన ఫలితాల ఆధారంగా రూపొందించిన నివేదిక. కీళాడి అనేది తమిళనాడులో శివగంగై జిల్లాకు చెందిన అతి ప్రాచీన కాలపు స్థలం . ఈ ప్రాంతంలో వేల సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందిన నగర నాగరికతకు సంబంధించిన పురావస్తు ఆధారాలు కనుగొన్నారు. నివేదికలో అక్కడ ఇనుపరాతి యుగపు నగర నిర్మాణం, ఇండ్లు, పాద ముద్రలు, స్మారకాలు, నాణేలు, సిరామిక్ వస్తువులు తదితర ఆధారాలు లభ్యమైనట్లు నివేదికలో పొందు పరిచారు. ఈ నివేదిక ఆధారంగా తమిళనాడులో పురాతన నాగరికత, వ్యవస్థీకృత పట్టణ జీవితం ఆధారంగా చరిత్రపై కొత్త అధ్యయనాలు జరుగుతున్నాయి. సరళంగా చెప్పాలంటే, కీళాడి నివేదిక అనేది తమిళనాడు ప్రాంతంలో వందల సంవత్సరాల క్రితం పురాతన కాలంలో ఉన్న, అత్యాధునికమైన నగర నాగరికత గురించి శాస్త్రీయ వివరాలు ఇచ్చే పురావస్తు నివేదిక. ఈ ప్రాంతంలో 2010 నుంచి వివిధ దశల్లో తమిళనాడు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతున్నారు.

ఆర్థిక మంత్రి ఆరోపణలు

తమిళనాడు ఆర్థిక మంత్రి థంగం తేనరాసు కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి రావలసిన నిధులను ఇవ్వడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ , రాజకీయంగా ఉన్న ప్రతీకారంతో నిధులను నిలిపివేస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రానికి రావలసిన రూ.4,000 కోట్లలో కేవలం రూ.450 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి ప్రాజెక్టుల కోసం ఇంకా రూ.3,407 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు.