
అవినీతి టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ‘పరివర్తన్’: అమిత్ షా
‘పరివర్తన్’ అంటే కేవలం ముఖ్యమంత్రిని మార్చడం కాదని, అవినీతి, అక్రమ చొరబాట్లకు స్వస్తి పలికి టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. సోమవారం ‘పరివర్తన్ యాత్ర’ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. మథురాపూర్‌లో నిర్వహించిన సభలో షా మాట్లాడుతూ మమతా దీది ఈ యాత్ర అధికారానికి రావడానికే అని అంటున్నారు. కానీ ‘పరివర్తన్’ అంటే కేవలం సీఎం మార్పు కాదు. బెంగాల్‌ను చొరబాట్ల నుంచి విముక్తం చేయడం, అవినీతిరహితం చేయడం. అవినీతి టీఎంసీ ప్రభుత్వాన్ని తొలగించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అసలు అర్థమని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది యాత్రలు
పశ్చిమ బెంగాల్ అంతటా మొత్తం తొమ్మిది పరివర్తన్ యాత్రలు చేపడుతున్నామని షా వెల్లడించారు. ఇప్పటికే సిలిగురి, నవద్వీప్, మెదినిపూర్, పురులియా నుంచి నాలుగు యాత్రలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇవి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ ప్రారంభించారని గుర్తు చేశారు. సోమవారం మాల్దా, హుగ్లీ, బర్ధమాన్, ఉత్తర 24 పరగణాలు, మథురాపూర్ నుంచి యాత్రలు మొదలయ్యాయని వివరించారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.
సోనార్ బంగ్లా వైభవం తిరిగి తెచ్చే సమయం
దశాబ్దాలుగా రాష్ట్రం దుర్వినియోగ పాలనతో నష్టపోయిందని షా ఆరోపించారు. కమ్యూనిస్ట్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని, ఆ తరువాత మమతా బెనర్జీ నాయకత్వంలో పరిస్థితి మరింత దిగజారిందని విమర్శించారు. ఒకప్పుడు సిరిసంపదలతో వెలిగిన బెంగాల్ నేడు వెనుకబడింది. ఇప్పుడు ‘సోనార్ బంగ్లా’ వైభవం తిరిగి తీసుకురావాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
2026 ఎన్నికల దిశగా భారీ ప్రచారం
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా చేపట్టిన ఈ యాత్ర సుమారు 5,000 కిలోమీటర్ల మేర సాగనుంది. 63 ప్రధాన సభలు, 282 చిన్న సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చివరగా కొల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే భారీ సభతో యాత్ర ముగియనుంది. అవినీతి, మహిళల భద్రత, అక్రమ చొరబాట్లు, జాతీయ భద్రత అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధి, ఉపాధి, గ్రామీణ-పట్టణ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
బడ్జెట్ పై విమర్శలు
పశ్చిమ బెంగాల్ బడ్జెట్ కేటాయింపులపై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందిన వెంటనే మమతా ప్రభుత్వం ప్రాధాన్యతలు ఏవో ప్రజలకు స్పష్టమయ్యాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడే బెంగాల్ బడ్జెట్ విధానసభలో ఆమోదం పొందింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.80 కోట్లు కేటాయించారు. అదే సమయంలో మదరసాలకు రూ.5,700 కోట్లు కేటాయించారు. పరిశోధన, అభివృద్ధి కోసం తక్కువ నిధులు… మదరసాలకు వేల కోట్లు… టీఎంసీ అజెండా ఏమిటో చెప్పాలి? అంటూ ప్రశ్నించారు.
బెంగాల్ అప్పుల్లో కూరుకుపోయింది
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా షా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు బెంగాల్ రూ.8 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఓ శిశువు జన్మించిన క్షణం నుంచి అతని మీద రూ.77,000 అప్పు భారం పడుతోంది. దేశంలో ఎక్కడైనా బెంగాల్ పేరు వినగానే అవినీతి ప్రభుత్వ ప్రతిఛాయే గుర్తుకు వస్తోందని విమర్శించారు. టీఎంసీ ప్రభుత్వం అవినీతి, తప్పుడు ప్రాధాన్యతల కారణంగా రాష్ట్రాన్ని వెనక్కు నెట్టిందని షా ఆరోపించారు. బెంగాల్ అభివృద్ధికి పారదర్శక పాలన అవసరమని పేర్కొన్నారు.
