
అవినీతి కేసులో ఒడిశాలో రికార్డు సీజ్
ఓ అధికారి మూఫ్పై వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో విజిలెన్స్ వారు ఆయన అవినీతి చిట్టా బాగోతాన్ని బట్టబయలు చేశారు. ఒకేరోజు దాదాపు 4.27 కోట్లనగదను లెక్కించారు. కట్టలకట్టల నగదును చూసి ముక్కున వేలేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఒకే రోజు ఇంత మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న మొదటివ్యక్తిగా అవినీతిలో చరిత్ర సృష్టించాడు. వివరాల్లోకి వెళితే..అవినీతి కేసులో అరెస్టైన ఒడిశా గనుల శాఖ అధికారికి చెందిన ఇంటి నుంచి రూ. 4.27 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ట్రాలీ బ్యాగుల్లో నోట్ల కట్టలు నింపి ఉంచిన ఈ నగదును భువనేశ్వర్‌లోని ఆయన ఫ్లాట్‌లో నుంచి సీజ్ చేశారు. రాష్ట్ర విజిలెన్స్ విభాగం మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ దేవవ్రత మొహంతి నివాసంలో ఈ సోదాలు నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ యశ్వంత్ జెత్వా మాట్లాడుతూ, ఇది రాష్ట్రంలో అవినీతి నిరోధక సంస్థ చరిత్రలోనే అత్యధిక నగదు స్వాధీనం చేసుకున్న కేసు అని తెలిపారు. భువనేశ్వర్ డివిజన్ విజిలెన్స్ ఎస్పీ సరోజ్ కుమార్ సమాల్ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు రూ. 4.27 కోట్ల నగదు లెక్కించారు. మొహంతీపై 2009లో కూడా ఇలాంటి అవినీతి కేసు నమోదైందని, మయూర్భంజ్ జిల్లా కోర్టులో విచారణ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఏకకాలంలో సోదాలు
అధికారుల సమాచారం ప్రకారం, లైసెన్సు కలిగిన బొగ్గు వ్యాపారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకునేందుకు సహకరిస్తానని చెప్పి రూ. 30,000 లంచం తీసుకుంటుండగా మొహంతీని పట్టుకున్నారు. అరెస్టు అనంతరం భువనేశ్వర్ ఫ్లాట్, భద్రక్ జిల్లాలోని పూర్విక ఇల్లు, కటక్‌లోని కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి నగదు స్వాధీనం చేసుకున్నారు. మొహంతీ కార్యాలయ డెస్క్ నుంచి అదనంగా రూ. 1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా భువనేశ్వర్‌లో రెండు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు, సుమారు 130 గ్రాముల బంగారం, 2,400 చదరపు అడుగుల స్థలంలో నిర్మాణంలో ఉన్న భవనం గుర్తించారు. ఆయన పేరిట 10 బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్నట్లు తెలిసింది. అవి కూడా పరిశీలనలో ఉన్నాయని అధికారులు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. 2004లో నెలకు రూ. 8,000 జీతంతో జూనియర్ మైనింగ్ అధికారిగా ప్రభుత్వ సేవలో చేరిన మొహంతీ, బోలాంగిర్, బరిపడ, బెరహంపూర్ ప్రాంతాల్లో పనిచేసి ప్రస్తుతం కటక్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
గతంలో 2022 ఏప్రిల్ 7న గంజాం జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ నివాసం నుంచి రూ. 3.4 కోట్లు స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర విజిలెన్స్ చరిత్రలో గరిష్ఠంగా నమోదైంది. తాజా కేసుతో ఆ రికార్డు చెదిరింది.
ఈ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ స్పందిస్తూ, రాష్ట్రంలో ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ పర్యవేక్షణలో అవినీతి విస్తృతంగా పెరిగిందని ఆరోపించారు.
