
“అవినీతికి ముఖ్యమంత్రే బాధ్యుడు” - జీహెచ్ఎంసీ అక్రమాలపై కవిత ధ్వజం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అగ్రస్థాయికి చేరుకుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల్లో జరుగుతున్న భారీ అవినీతికి ముఖ్యమంత్రే బాధ్యుడని ఆమె ఆరోపించారు.
రూ.1,148 కోట్ల నామినేషన్ దోపిడీ
సాధారణంగా గ్రామాల్లో రూ. 5 లక్షల పనికైనా టెండర్లు పిలవడం ఆనవాయితీ అని, కానీ ఈ ప్రభుత్వం జీహెచ్ఎంసీలో ఏకంగా రూ.1,148 కోట్ల పనులను టెండర్లు పక్కనపెట్టి తమ అనుచరులకు నామినేషన్ ద్వారా కట్టబెట్టారని కవిత ఆరోపించారు. ఇది తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్‌కు పూర్తి వ్యతిరేకం. గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు అంతకంటే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోంది. వెంటనే ఈ నామినేషన్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు .
హైడ్రా పేరుతో వసూళ్లు
హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలను ప్రభుత్వం బెదిరిస్తోందని కవిత ఆరోపించారు. చదరపు అడుగుకు రూ. 150 చొప్పున వసూలు చేస్తూ వ్యాపారులను వేధిస్తున్నారని, ఈ బెదిరింపులు ఆపకపోతే ప్రభుత్వ అవినీతి చిట్టాను ఈడీకి అందజేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో అమ్మిన ప్లాట్ల నుండి వచ్చి ఉన్న రూ.35 వేల కోట్లను ఎక్కడ ఖర్చు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు .
కాళేశ్వరంపై కక్షపూరిత చర్యలు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ద్వంద్వవ్యవహారం చేస్తోందని కవిత వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్ విఫలమైందని చూపించడానికి ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు ఎండబెట్టి రైతులను నట్టేట ముంచిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. కమీషన్ల కోసం మరమ్మత్తుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై విమర్శలు
మహిళా రిజర్వేషన్ విషయంలో బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయడం మహిళలతో మోసం చేయడమేనని అన్నారు. 2027 జనగణన పూర్తి అయిన తర్వాత బీసీ జనగణన చేపట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎంపీ అర్వింద్‌పై కవిత ఘాటు వ్యాఖ్యలు
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు కవిత ఘాటుగా సమాధానమిచ్చారు. "తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి గలవారు. నేను ఉద్యమంలో రాటుదేలిన బిడ్డను. అర్వింద్ నోరు అదుపులో పెట్టుకోవాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు" అని హెచ్చరించారు.
అలాగే తెలంగాణ జాగృతి కార్యక్రమాల నిర్వహణ కోసం 21 కమిటీలను నియమించినట్లు ఆమె వెల్లడించారు. సుమారు 500 మంది వాలంటీర్లతో సభ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని కవిత వివరించారు.
