Let's talk: editor@tmv.in
అవసాన దశలో ఏపీ ఆవిర్భావ దినోత్సవం

అవసాన దశలో ఏపీ ఆవిర్భావ దినోత్సవం

Pinjari Chand
3 నవంబర్, 2025

దేశంలో నవంబర్ 1 న సుమారు 7 రాష్ట్రాల్లో ఆవిర్బావ వేడుకలు జరుగుతాయి. అలాగే ఏపీలో కూడా. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం క్రమంగా అవసానంలోకి చేరుకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆవిర్భావం అనగానే ఉత్సాహం, సంబరాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో మార్మోగేది. పాఠశాలల్లో, కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలు, ప్రదర్శనలు, పురస్కార కార్యక్రమాలు ఇలా అంతా ఒక పండుగ వాతావరణంలో సాగేది. అయితే ఈసారి ఆ దృశ్యం ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వం మౌనం, అధికార కూటమిలో తేడా, ప్రజల్లో అయోమయం ఇవన్నీ కలిపి ‘ఆవిర్భావ దినోత్సవం’ అనే సంప్రదాయానికి సమాప్తం పలికినట్టేనా అనే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ నుంచి విడివడ్డాక ఏపీలో 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కానీ సీఎం చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడానికి ముందుకు రాలేదు. అలాగే జూన్ 2 రెండున తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటే, ఏపీలో నవనిర్మాణ దీక్ష పేరుతో టీడీపీ సంబరాల జోలికి వెళ్లలేదు. మనకు ఇప్పుడు పునర్నిర్మాణ దశ. గతాన్ని గుర్తుచేసుకోవడం కంటే భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని బాబు ఆ అంశాన్ని దాటవేశారు. అలాగే అప్పటికీ ప్రజల్లో ఉన్న విభజన ఉద్వేగాలు ఇంకా మానకపోవడం కూడా ఓ కారణం కావడంతో జూన్ రెండును వారు ఏపీ పునర్విభజన దినంగా భావిస్తారు. తదనంతరం 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నవంబర్ 1నే ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి ఉత్సవాలను అక్కడక్కడ జెండాలు ఎగురవేసి మమ అనిపించింది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలను పట్టించుకోలేదు.

చారిత్రక నేపథ్యం: తెలుగు తల్లి ఆవిర్భావం

మద్రాసు నుంచి విడివడి 1953 అక్టోబర్‌ 1న ‘ఆంధ్ర రాష్ట్రం’ఏర్పడింది. అదే మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో కీలక మలుపు. పులివెందుల జిల్లాలోని (అప్పటి మద్రాస్‌ రాష్ట్రంలోని) తూర్పు తీరప్రాంతం నుంచి మొదలైన ఉద్యమం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. తరువాత 1956 నవంబర్‌ 1న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. రాయలసీ, తెలంగాణ ప్రాంతాలతో కలిపి ‘ఆంధ్రప్రదేశ్‌’ ఏర్పడింది. హైదరాబాద్‌ రాజధానిగా, తెలంగాణా ప్రాంతం కలిసిన తర్వాత. అప్పటి నుంచి నవంబర్‌ 1ని “ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావ దినోత్సవం”గా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

ప్రత్యేక తెలంగాణ తర్వాత

2014లో రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జూన్‌ 2న తెలంగాణా వేరు రాష్ట్రంగా అవతరించగా, మిగిలిన భాగం “రెసిడ్యుయల్ ఆంధ్రప్రదేశ్‌”గా నిలిచింది. ఆ తరవాత ఆవిర్భావ దినోత్సవం ఏ తేదీన జరుపుకోవాలి అన్న విషయంలో గందరగోళం నెలకొంది. కొంతమంది నాయకులు నవంబర్‌ 1నే ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు సంకేతంగా గుర్తించాలని వాదిస్తుంటే, మరికొందరు “మొత్తం కొత్త రాష్ట్రం అవతరించిన రోజు జూన్‌ 2. అందుకే దానినే అధికారిక తేదీగా స్వీకరించాలని అంటున్నారు. తాజాగా ఉద్యోగ సంఘాలు కొత్త కోణం తెరమీదకు తెచ్చాయి. వారు ‘మూల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు అక్టోబర్‌ 1 కాబట్టి అదే నిజమైన ఆవిర్భావ దినం’ అని వాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఈ దిశగా చర్చలు మొదలుపెట్టాయి. ‘తెలుగు గర్వం, భాషా ఐక్యత’ అనే ఆత్మను ప్రతిబింబించే రోజు అక్టోబర్‌ 1 అని అవి భావిస్తున్నాయి.

ప్రభుత్వం మౌనం – కూటమిలో గందరగోళం

ఈ ఏడాది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికార టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో తేడా స్పష్టమైంది. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మాత్రం సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. మన రాష్ట్రం సమృద్ధిగా ఎదగాలి. ఆంధ్రులు అభివృద్ధి, సమగ్రతతో ముందుకు సాగాలని ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ అధికారిక ఖాతాలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభుత్వస్థాయిలో ఎలాంటి వేడుకలు కూడా లేవు. కనీసం ఆవిర్భావ ఊసే లేకుండా పోయింది. బీజేపీ కూడా ఈ అంశంపై పూర్తి నిశ్శబ్దం పాటించింది. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఎలాంటి ప్రకటనలు లేకపోవడం గమనార్హం.

ప్రజల్లో అయోమయం

తర్వాత ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం ఉత్సాహం క్రమంగా తగ్గుతూ వచ్చింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం సాంప్రదాయ విధానంలో జెండా ఆవిష్కరణ మాత్రమే జరుగుతోంది. కొత్త రాష్ట్ర రాజధాని లేకపోవడం, విభజన గాయాలు ఇంకా మానకపోవడం, రాజకీయ స్పష్టత లేకపోవడం అన్ని కలిసి ప్రజల్లో ఆవిర్భావ దినోత్సవంపై ఆసక్తిని తగ్గించాయి.

ఆవిర్భావ దినోత్సవం అనే సందర్భం రాజకీయ చిహ్నంగా కాకుండా ప్రజా గౌరవ దినంగా మారాలి. 1953లో పుట్టిన రాష్ట్రం, 1956లో విస్తరించి, 2014లో తిరిగి ముక్కలైన ఆంధ్రం తన చరిత్రను మర్చిపోకూడదు. తేదీ ఏదైనా కావచ్చు కానీ ఆత్మ ఒక్కటే ఉండాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.