Let's talk: editor@tmv.in
అవసరమైతే పోరాడటానికి వెనుకాడం

అవసరమైతే పోరాడటానికి వెనుకాడం

Shaik Mohammad Shaffee
13 అక్టోబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా ఏకపక్ష నిర్ణయాన్ని దుయ్యబట్టిన చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రతీకార చర్యలకు వెనుకాడబోమని గట్టిగా హెచ్చరించింది.

ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం నవంబర్‌ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని అమెరికా ప్రకటించింది. ఇప్పటికే చైనా ఉత్పత్తులపై ఉన్న సుంకానికి ఇది అదనంగా చేరడంతో మొత్తం టారిఫ్ దాదాపు 130 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

అమెరికా ద్వంద్వ ప్రమాణాలు: చైనా ఆగ్రహం

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఘాటుగా స్పందించింది. సుంకాల విషయంలో అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని తీవ్రంగా విమర్శించింది. ట్రంప్‌ చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో "సాధారణంగా మేము ఎవరితోనూ ఘర్షణలకు దిగం. కానీ అవసరం వస్తే పోరాడటానికి మాత్రం వెనకడుగు వేయం. మాపై చర్యలకు ప్రతి చర్యలు కూడా ఉంటాయి" అని స్పష్టం చేసింది. ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇరు దేశాల ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని పేర్కొంది. బెదిరింపులతో కాకుండా, చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని అమెరికాకు సూచించింది.

100 శాతం సుంకాలకు కారణం ఏమిటి?

చైనా దిగుమతులపై ట్రంప్‌ హఠాత్తుగా 100 శాతం సుంకాలను విధించడానికి ప్రధాన కారణం.. చైనా ఇటీవల రేర్-ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై కొత్త, కఠినమైన నియంత్రణలను విధించడమే. రేర్-ఎర్త్ ఖనిజాలు సెమీకండక్టర్లు, ఫైటర్ జెట్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ వంటి కీలకమైన అమెరికా రక్షణ, పారిశ్రామిక రంగాలకు అత్యవసరం. ఈ ఖనిజాలపై ప్రపంచవ్యాప్తంగా చైనా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. ప్రపంచ రేర్ ఎర్త్ తవ్వకంలో దాదాపు 70 శాతం, ప్రాసెసింగ్‌లో 90 శాతం చైనా వాటానే ఉంది.

చైనా చర్య “అంతర్జాతీయ వాణిజ్యంలో నైతిక అవమానం” అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని, దానికి తగిన బదులు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. చైనా తన రేర్-ఎర్త్ నియంత్రణల విషయంలో వెనక్కి తగ్గకపోతే, అదనపు సుంకాలు త్వరలోనే అమలులోకి వస్తాయని ట్రంప్ హెచ్చరించారు.

జిన్‌పింగ్‌తో భేటీ రద్దు సంకేతాలు

ఈ తాజా వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ఈ నెల చివర్లో దక్షిణ కొరియాలో జరగాల్సిన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఏపీఈసీ) శిఖరాగ్ర సమావేశం కూడా సందిగ్ధంలో పడింది. జిన్‌పింగ్‌తో భేటీని రద్దు చేసుకుంటానంటూ ట్రంప్‌ బెదిరింపులకు దిగడం గమనార్హం.

భారతీయ ఎగుమతిదారులకు లాభం?

అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఈ వాణిజ్య ఉద్రిక్తతలు భారతీయ ఎగుమతిదారులకు ఒక అవకాశంగా మారవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా వస్తువులపై 100 శాతం అదనపు టారిఫ్ విధించడంతో, అమెరికన్ కొనుగోలుదారులు చైనాకు బదులుగా భారతదేశం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎస్.సి. రల్హన్ మాట్లాడుతూ, ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకొని అమెరికన్ మార్కెట్‌లో భారతీయ ఎగుమతులను పెంచవచ్చని తెలిపారు. ఈ టారిఫ్‌ల కారణంగా ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, పాదరక్షల వంటి రంగాల్లో భారతీయ వ్యాపారాలకు కొత్త కొనుగోలుదారులు లభించవచ్చని అంచనా. మొత్తం మీద ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ తారస్థాయికి చేరడంతో, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి.

అవసరమైతే పోరాడటానికి వెనుకాడం - Tholi Paluku